25-03-2025 06:30:29 PM
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి ఏరియా పరిధిలోని రామకృష్ణాపూర్ లో నివసిస్తున్న యువ కార్మికుల పిల్లల విద్యాభ్యాసం కొరకు వచ్చే విద్యాసంవత్సరం నుండి బస్సు సౌకర్యం కల్పించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు బ్రాంచ్ అధ్యక్షులు సాంబార్ వెంకటస్వామి కోరారు. ఈ మేరకు మంగళవారం రామకృష్ణాపూర్ ఏరియా హాస్పిటల్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రసన్న కుమార్ కు ఆయన వినతిపత్రం అందజేశారు. ఆనంతరం ఆయన మాట్లాడారు. కార్మికులు తమ పిల్లల విద్యాభ్యాసం కోసం మంచిర్యాల లోని ప్రైవేట్ పాఠశాలల్లో చదివించడం జరుగుతుందని, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం బస్సు ఫీజులు ఎక్కువగా వసూలు చేయడం వల్ల కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు తమ పిల్లల విద్యభ్యాసానికి ఇబ్బందులు పడుతున్నారని దీని మూలంగా వైద్యులు ఏరియా ఆసు పత్రిలో పనిచేయడానికి ముందుకు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం గోదావరిఖని, జైపూర్ థర్మల్ ప్లాంట్లలో కార్మికుల పిల్లల కోసం సాధారణ రెంట్ పద్ధతిపై స్కూల్ బస్సులు ఏర్పాటు చేసిన విధంగా వచ్చే విద్యా సంవత్సరం నుండి రామకృష్ణాపూర్ నుండి కార్మికుల, ఏరియా ఆసుపత్రి వైద్యుల పిల్లల కోసం స్కూల్ బస్సును ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి ఫిట్ సెక్రటరీ శ్రీకాంత్, హాస్పిటల్ సిబ్బంది షఫీ, విజయ కుమారి, ధనలక్ష్మి, మల్లీశ్వరి, మానస, రాజేంద్రప్రసాద్, ప్రశాంత్, రమేష్ లు పాల్గొన్నారు.