అప్రమత్తంగా వ్యవహరించిన డ్రైవర్
రైల్వే అండర్ బ్రిడ్జి పనులు ఇంకెన్నాళ్ళు
హుజూర్ నగర్ ,(విజయక్రాంతి): చింతలపాలెం మేళ్లచెరువు రోడ్ లో బుధవారం స్కూల్ బస్సుకు పెను ప్రమాదమే తప్పింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైల్వే అండర్ బ్రిడ్జి పక్కన ఉన్న మట్టి రోడ్డు లో మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి పంట పొలంలోకి జారిపోయింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి పిల్లలను స్కూల్ బస్సు నుంచి దింపడంతో పెను ప్రమాదమే తప్పింది. అనంతరం అటుగా వెళ్తున్న రైతులు ట్రాక్టర్ సహాయంతో స్కూల్ బస్సుకు తాడు కట్టి బయటకు లాగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.మేళ్లచెరువు, చింతలపాలెం రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఎన్నో సంవత్సరాలు గడుస్తున్న నిర్మాణం నత్త నడకన సాగుతుంది. దీంతో రైల్వే బ్రిడ్జి పక్కన ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు లో వాహనదారులు ప్రయాణం సాగిస్తున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేసి శాశ్వతమైన పరిష్కారం చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు.