calender_icon.png 8 February, 2025 | 11:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారితో స్కూల్ బస్సు డ్రైవర్ అసభ్య ప్రవర్తన

08-02-2025 12:00:00 AM

తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ఆందోళన 

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 7 : ఒకటో తరగతి చదువుతున్న ఓ చిన్నారితో స్కూల్ బస్సు డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన శంషాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేట్ స్కూలులో మూడు రోజుల క్రితం యాజమాన్యం విద్యార్థులను పిక్నిక్ తీసుకెళ్ళింది.

ఒకటో తరగతి చదువుతున్న ఆరు సంవత్సరాల చిన్నారి అక్కడ టాయిలెట్ కు వెళ్లి వస్తుండగా స్కూల్ బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్న జోసెఫ్ రెడ్డి అనే వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడికి యత్నించాడు. విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని అతడు బెదిరించాడు. చిన్నారికి గాయాలు కావడంతో గమనించిన తల్లి ప్రశ్నించగా జరిగిన విషయాన్ని చెప్పింది.

దీంతో శుక్రవారం బాలిక తల్లిదండ్రులు, కుటుంబీకులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. వారికి విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పాఠశాల ప్రిన్సిపాల్ అక్కడి నుంచి పరారయ్యాడు.

ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.. అంతకుముందు ఆర్జిఐఏ పిఎస్ ఇన్స్పెక్టర్ బాలరాజు విద్యార్థి తల్లిదండ్రులతోపాటు విద్యార్థి సంఘ నాయకులతో మాట్లాడారు. 

కఠిన చర్యలు తీసుకోవాలి :  బండి గోపాల్ 

 చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన బస్సు డ్రైవర్ తో పాటు పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బండి గోపాల్ డిమాండ్ చేశారు. ఆయన పాఠశాల వద్దకు చేరుకొని చిన్నారి కుటుంబ సభ్యులకు మద్దతు పలికారు.

జరిగిన విషయాన్ని ప్రశ్నించడానికి వస్తే పాఠశాల యాజమాన్యం గుండాలను పెట్టి బెదిరింపులకు పాల్పడడం ఎంతవరకు సమంజసం అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపించిందని విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.