calender_icon.png 2 October, 2024 | 6:02 PM

స్కూల్ బస్సులో మంటలు

02-10-2024 01:50:32 AM

  1. చిన్నారులు సహా 25 మంది సజీవదహనం
  2. థాయ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోరం

బ్యాంకాక్, అక్టోబర్ 1: థాయ్‌లాండ్  రాజధాని  బ్యాంకాక్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో విద్యార్థులు సహా 25మంది అగ్నికి ఆహుతయ్యారు. స్కూల్ ట్రిప్‌కు వెళ్లిన ఓ పాఠశాల బస్సు సెంట్రల్ ఉతాయ్ థాని ప్రావిన్స్ నుంచి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ప్రమాద సమయంలో బస్సులో 38 మంది విద్యార్థులు, టీచర్లు, బస్సు సిబ్బంది మొత్తం 44మంది ఉన్నట్లు సమాచారం. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. టైరు పేలిపోవడం వలనే బస్సు అదుపుతప్పి మంటలు వ్యాపించాయని కొందరు స్థానికులు వెల్లడించారు. అయితే ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా బస్సులోని మృతదేహాలను తీసుకురాలేదని స్థానికులు ఆరోపించారు.

ఈ ఘటనపై స్పందించిన థాయ్ రవాణశాఖ మంత్రి సూర్యా జుంగ్రుం గ్రూంగ్‌టిక్ మాట్లాడుతూ.. బస్సులో నుంచి 16మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లను బయటకు తీసుకువచ్చామని.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మిగిలినవారి పరిస్థితిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదని ఆయన పేర్కొన్నారు.

థాయ్‌లాండ్ మరో మంత్రి అనుతిన్ చర్నవిరకుల్ మాట్లాడుతూ.. మృతుల సంఖ్యను ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేమని పేర్కొన్నారు. ప్రమాద స్థలంలో ఇంకా దర్యాప్తు జరుగుతోందని.. ప్రమాదం నుంచి 19మంది బయటపడటంతో మిగిలిన 25మంది చనిపోయి ఉండవచ్చని తెలిపారు. ప్రమాదంపై స్పందించిన ఆ దేశ ప్రధాని పేటోంగ్‌టార్న్ షినవత్రా.. ముందుగా మృతులకు సంతాపం తెలిపారు.

ప్రమాదంలో గాయపడినివారికి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని.. మృతిచెందిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామని పేర్కొన్నారు. ఇక ఈ ప్రమాదంలో బస్సు కాలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మంటల్లో చిక్కుకున్న విద్యార్థులు, టీచర్లు ఎంత క్షోభ అనుభవించి ఉంటారో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.