- తొమ్మిది మంది విద్యార్థులకు గాయాలు
- కాటేదాన్ టీఎన్‌జీఓస్ కాలనీలో ఘటన
రాజేంద్రనగర్, ఆగస్టు 6: ఓ స్కూల్ బస్సు బ్రేక్ ఫెయిల్ అయి అదుపుతప్పి కారును ఢీకొట్టి బోల్తాపడిన ఘటన మంగళవారం కాటేదాన్‌లోని పయనీర్ ఇంటర్నేష నల్ స్కూల్ వద్ద చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్, స్థానికుల కథనం ప్రకారం.. పయనీర్ ఇంటర్‌నేషనల్ స్కూల్ బస్సు సాయంత్రం విద్యార్థులను ఇళ్లకు తరలించేందుకు పాఠశాల వద్ద విద్యార్థులను ఎక్కించుకుంటోంది. బస్ డ్రైవర్‌తోపాటు ఆయా కింద ఉండి విద్యార్థులను ఎక్కించుకుంటున్నారు. ఈక్రమంలో బస్సు బ్రేక్ ఫెయిల్ అయి వెనుకాల పల్లం(డౌన్) ప్రాం తం ఉండటంతో వెనక్కి వెళ్లి అక్కడే ఉన్న ఓ కారును ఢీకొట్టి బోల్తాపడింది.
ఈ క్రమంలో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై హాహాకారాలు చేశారు. సేవ్ మీ.. సేవ్ మీ అంటూ కేకలు వేశారు. ఈ ప్రమాదంలో బస్సు అద్దాలు పగిలిపోగా.. తొమ్మిది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించామని ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం చోటు చేసుకుందని పోలీసుల దర్యాప్తులో తేలింది.