18 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు
నాగర్‌కర్నూల్, నవంబర్ 20 (విజయక్రాంతి): ప్రైవేటు స్కూల్ బస్సు, ట్రాక్టర్ ఢీకొనడంతో విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వట్టెం గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకుంది.
మండలంలోని మేధాన్స్ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న కోడుపర్తి, కోడుపర్తి తండా, వట్టెం తండా గ్రామాలకు చెందిన విద్యార్థులను ఎక్కించుకుని బాజీపూర్ బస్సు మీదుగా వెళ్తోంది. ఈ క్రమంలో వట్టెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కల నడుమ రావడంతో గమనించక స్కూల్ బస్సు ఢీకొట్టింది.
దీంతో బస్సు రోడ్డుపక్కన ఫల్టీకొట్టింది. అందులో ఉన్న 18 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. డీఈవో గోవిందరాజులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్కూల్ బస్సు డ్రైవర్ అజాగ్రత్తతోనే ప్రమాదం జరిగిందని షోకాజ్ నోటీసులను జారీ చేశారు.