calender_icon.png 23 November, 2024 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల స్కాలర్‌షిప్ పెంచాలి

23-10-2024 12:17:48 AM

  1. కాలేజీలు, హాస్టళ్లకు సొంత భవనాలను నిర్మించాలి
  2. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
  3. విద్యార్థులతో కలిసి బర్కత్‌పురలో ర్యాలీ

ముషీరాబాద్, అక్టోబర్ 22: కాలేజీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ను రూ.5,500 నుంచి రూ.20 వేలకు పెంచాలని, అదేవిధంగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మాజీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్‌షిప్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులతో మంగళవారం బర్కత్‌పురలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. ఉద్యోగులకు జీతాలు పెంచుతారు కానీ విద్యార్థుల స్కాలర్‌షిప్ పెంచరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి విదేశీ విద్య స్టుఫైండ్ మంజూరు చేయాలని అన్నారు. ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ, పీజీ, ఇంటర్ చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజు స్కీమ్‌ను పునరుద్దరించాలన్నారు. అందరికీ రాష్ట్రంలో కాలేజీలు, హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, వాటికి సొంత భవనాలు నిర్మించాలని కోరారు.

బీసీ స్టడీ సర్కిల్‌కు రూ.200 కోట్లు కేటాయించాలని, అర్హులందరికీ డీఎస్సీ, గ్రూప్ సివిల్స్, బ్యాంకింగ్ ఇతర పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ ముదిరాజ్, బీసీ సంఘం నాయకులు రవి యాదవ్, ఉదయ్ నేత, పగిళ్ల సతీశ్, సీ రాజేందర్, ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మల వీరన్న, విద్యార్థులు పాల్గొన్నారు.