ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి
ఖమ్మం, అక్టోబర్ 22 (విజయక్రాంతి): కేంద్ర పథకాలను పకడ్బందీగా అమలు చేసి లబ్ధిదారులకు అందేలా అధికారులు పని చేయాలని ఖమ్మం ఎంపీ రామసహాయ రఘురాంరెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎంపీ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయ న మాట్లాడారు. బ్యాటరీ ఆధారిత వాహనాలను అవసరం, అర్హత ఉన్న దివ్యాంగులకు అందించాలన్నారు. పరిశ్రమలకు సంబంధించి పూర్తి పక్కా నివేదిక తయారు చేయా లన్నారు. జిల్లాలో పత్తి పంట అధికంగా పండుతూ జిన్నింగ్ మిల్లులు లేని క్లస్టర్లను గుర్తించాలని, అక్కడ సీసీఐ ద్వారా జిన్నింగ్ మిల్లుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదుపై నివేదిక తయారు చేసి, అందజేయాలని ఆదేశించారు. సత్తుపల్లి ఆస్పత్రుల్లో సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్లపై నివేదిక తెప్పించాలని కోరారు. సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్లను తనిఖీ చేయాలన్నారు.
వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ.. వైరా బ్రిడ్జి మరమ్మతు పనులుపూర్తిచేయాలని కోరారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వివిధ పథకాల కింద చేపట్టిన వివరాలను తెలిపారు. మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, శిక్షణ సహాయ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, డీఎఫ్‌వో తదితరులు పాల్గొన్నారు.