ఘట్ కేసర్ (విజయక్రాంతి): పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని బీఆర్ఎస్ కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్ డిమాండ్ చేశారు. ఘట్ కేసర్ మండల పరిషత్ సమావేశం హాలులో మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ అధ్యక్షతన ఇందిరమ్మ ఇండ్ల కమిటీలతో ప్రత్యేక సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు, కొత్త దరఖాస్తుల స్వీకరణపై సమావేశంలో చర్చ జరుగుతుండగా చైర్ పర్సన్ భర్త జంగయ్య యాదవ్ సమావేశంలో మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు కాంగ్రెస్ పార్టీ సూచించిన వారికే వర్తిస్తుందని చెప్పటంతో కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు వర్తించాలి గాని కాంగ్రెస్ పార్టీ నాయకులు సూచిస్తేనే కేటాయింపు జరుగుతుందని ఏలా అంటారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో అన్ని పార్టీల పేదలకు ప్రభుత్వ పథకాలు వర్తింపచేశారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని విమర్శించారు. జై బీఆర్ఎస్, జై కేసీఆర్ అంటు సమావేశంలో నినాధాలు చేశారు. ఏ పార్టీలో ఉన్న అర్హులైన అభ్యర్ధుల ఎంపికలో ప్రజా ప్రతినిధులకు అవకాశం ఇవ్వాలని, పార్టీలకతీతంగా అర్హులైన పేదలను గుర్తించాలని డిమాండ్ చేశారు. పేదలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అధికారిక సమావేశమా, లేక కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహిస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, కమీషనర్ చంద్రశేఖర్, మేనేజర్ వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు కొమ్మిడి అనురాధ, బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డి, బేతాల నర్సింగ్ రావు, బండారి ఆంజనేయులు గౌడ్, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.