రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య భయంగొలిపే స్థాయిలో పెరిగిపోతోంది. ఏ వార్తాపత్రికను తిరగేసినా భయంకరమైన రోడ్డు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మృత్యువాతకు గురైన అభాగ్యుల ఫోటోలు ప్రతిరోజూ దర్శనమిస్తాయి. వాహనాల సంఖ్య విపరీతం గా పెరిగిపోయింది.
రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారుకావడం, ట్రాఫిక్ నిబంధనలను కనీసంగా కూడా పాటించకపోవడం, మితిమీరిన వేగం, కాలం చెల్లిన వాహనాలు, పరిమితికి మించిన లోడ్‌తో పరుగులు తీసే లారీలు, ట్యాంకర్లు రోడ్డు ప్రమాదాలకు నేపథ్యంగా నిలుస్తున్నాయన్నది వాస్తవం. దీనికి తోడు ఇటీవల కాలంలో ’సెల్ రైడింగ్’ విపరీతంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
జనంతో కిక్కిరిసిన నగర రోడ్లు, వాహనాలు బారులు తీరిన హైవేలలో అష్టకష్టాలు పడుతూ సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం అన్నది సర్వసాధారణంగా మారింది. పోలీసులు దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణించి కఠినంగా వ్యవహరించాలి.
ట్రాన్స్ పోర్టు అధికారులు కూడా వాహనాల విషయంలోనూ, లైసెన్సుల మంజూరులోనూ ముందు జాగ్రత్తలను పాటించాలి. ట్రాఫి క్, ఆర్టీఏ విభాగాల్లో సిబ్బంది కొరతలేకుండా చూస్తే రోడ్డు ప్రమాణా లను నివారించడం సులభమవుతుంది.
సింగు లక్ష్మీనారాయణ,కరీంనగర్ జిల్లా