calender_icon.png 29 March, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమాయకులతో స్కానింగ్ చెలగాటం

25-03-2025 01:46:20 AM

  1. తప్పుడు రిపోర్టులతోఘరానా మోసం
  2. ఫీజుల్లో తగ్గేదేలే..రిపోర్టులు మాత్రం డొల్ల..
  3. విజయ స్కానింగ్ సెంటర్ద్వారా బయట పడ్డ మోసం
  4. అవయవలోపంతో జన్మించిన శిశువు
  5. రిపోర్టుల్లో మాత్రం అంతా ఓకే..డీఎంహెచ్‌వో కార్యాలయంలో 
  6. ఫిర్యాదు  చేసిన బాధిత కుటుంబం

జనగామ, మార్చి 24(విజయక్రాంతి): స్కానింగ్ సెంటర్ల మోసానికి ఎందరో అమాయకులు బలవుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి లో సేవలు అందుబాటులో లేకపోవడంతో వేలాది రూపాయలు వెచ్చించి ప్రైవేటు స్కానింగ్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోం ది. పేద, మధ్య తరగతి తేడా లేకుండా సదరు స్కానింగ్ సెంటర్లు అందినకాడికి దోచుకుంటున్నాయి. ఇదిలా ఉండగా అంత గా ఫీజులు వసూలు చేసినప్పటికీ సరైన రిపోర్టులు ఇవ్వకుండా మోసం చేస్తున్నాయి.

అప్‌గ్రేడెడ్ మెషీన్లు ఉన్నాయంటూ భారీగా ప్రచారం చేసుకుంటున్న స్కానింగ్ సెంటర్లు పనితీరులో మాత్రం డొల్లతనాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇటీవల ఓ స్కానింగ్ సెంటర్‌లో ఈ విషయం తేటతెల్లమైంది. జనగామ పట్టణంలోని బస్టాండ్ చిన్నగేటు సమీపంలో గల విజయ స్కానింగ్ సెంటర్ ప్రముఖ స్కానింగ్ సెంటర్‌గా విలసిల్లుతోంది. ఈ సెంటర్ ఓ బీఆర్‌ఎస్ నేత , ప్రముఖ వైద్యాధికారి కుటుంబానికి చెందినది కావడంతో గత పదేళ్ల సమయంలో వీరు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లు వ్యవహారం నడిచింది.

ఈ సెంటర్ లో విచ్చలవిడిగా ఫీజు వసూలు చేసినా ఎవరూ పట్టించుకున్న పాపన పోలేదు. అధికార అండదండలు  మెండుగా ఉండడంతో అనేక మోసాలు బయటికి రాకుండా మ్యానేజ్ చేశారనే ప్రచారం ఉంది. కానీ ఇటీవల ఓ బాధిత కుటుంబం తమకు జరిగిన అన్యాయంపై సదరు సెంటర్ నిర్వాహకులను నిలదీయ డం, ఆ తరువాత డీఎం హెచ్‌వో కార్యాలయంలో ఫిర్యాదు  చేయడంతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. 

లోపాలను గుర్తించని వైనం..

జనగామ మండలంలోని శామీర్‌పేటకు చెందిన ఓ గర్భిణి పట్టణంలోని విజయ స్కానింగ్ సెంటర్లో స్కానింగ్‌లు చేయించు కుంది. ఐదు నెలల కడుపుతో ఉన్న సమ యంలో ఆమెకు టిఫా స్కానింగ్ చేశారు. ఏడో నెలలో బేబీ గ్రోత్ స్కానింగ్ కూడా చేశారు. ఇందుకు గానూ వేలాది రూపా యల ఫీజు కూడా చెల్లించారు. ఈ రెండు స్కానింగ్‌ల ద్వారా బేబీ స్థితిగతులు తెలిసి పోతాయి. ఏదైనా లోపం ఉంటే బయట పడుతుంది. అందుకోసమే గర్భిణులు ఈ స్కానింగ్ చేయించుకుంటారు. అయితే స్కానింగ్ రిపోర్టులో బేబీ అన్ని విధాలా సరిగ్గానే ఉన్నట్లు వచ్చింది. అవయవాలన్నీ సరిగ్గానే ఉన్నాయని, ఎదుగుదలలోనూ ఎలాంటి లోటుపాట్లు లేవని స్కానింగ్ సెంటర్ ద్వారా వచ్చిన రిపోర్టుల్లో తేలింది. 

మూడు రంధ్రాలను గుర్తించని మెషీన్లు..

సదరు సెంటర్‌లో స్కానింగ్ రిపోర్టు బాగున్నట్లు రావడంతో గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిస్తుందని వారి కుటుంబ సభ్యులు భావించారు. తీరా గర్భిణి మగ బిడ్డకు జన్మనిచ్చాక శిశువు అవయవ లోపంతో జన్మించడంతో అందరూ అవాక్కయ్యారు. శిశువుకు పై పెదవి లేకపోవడం, పెదవి నుంచి కపాలం వరకు ఒక రంధ్రం, గుండెకు రెండు రంధ్రాలు, మూత్రపిండాలు ఎదగకపోవడం, కాలేయ సమస్య వంటివి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

ఇన్ని లోపాలతో శిశువు జన్మిం చడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుము న్నీరవుతున్నారు. ఇదంతా జరిగాకా స్కానింగ్ రిపోర్టులను మరోసారి పరిశీలిస్తే ఆ రిపోర్టుల్లో శిశువు అన్ని విధాలా బాగానే ఉన్నట్లు కనిపించడం గమనార్హం. దీంతో బాధిత కుటుంబ సభ్యులు సదరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకుల వద్దకు వెళ్లి నిలదీయగా వారు యంత్రంలో వచ్చిన రిపోర్టులే మేము ఇచ్చామంటూ విడ్డూ రంగా సమాధానం చెప్పారని బాధితులు వాపోయారు.

ఇన్ని లోపాలు ఉన్నప్పుడు తమకెందుకు చెప్పలేదని నిర్వాహకులను నిలదీశారు. స్కానింగ్ సెంటర్ నిర్వాహకుల వల్ల ఓ కుంటుంబానికి తీరని నష్టం వాటి ల్లింది. ఇప్పుడు శిశువుకు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా.. బతకడం కష్టమేనని డాక్టర్లు అంటున్నారని బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ అండదండలు..

సదరు స్కానింగ్ సెంటర్‌జనగామలో ఎంతో పేరొందింది. ఎక్కడా లేని విధంగా అడ్వాన్సుడ్ టెక్నాలజీ మెషీన్లు తమ వద్ద అందుబాటులో ఉన్నట్లు ప్రచారం కూడా చేసుకున్నట్లు పలువురు చెబుతున్నారు. ఇంతలా ప్రాచూర్యంలో  ఉన్న స్కానింగ్‌సెంటర్‌లో తప్పుడు రిపోర్టులు బయటికి రావడంపై పెద్ద చర్చ జరుగుతోంది.

అయితే సదరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు రాజకీయ అండదండలు మెండుగా ఉన్నాయని, అందుకే వీరిపై ఎవరూ చర్యలు తీసుకోవడం లేదనే అపవాదు కూడా అధికారులు మోస్తున్నట్లు సమాచారం. ఇప్పటి కైనా ఉన్నత వైద్యాధికారులు రాజకీయాలకు తలొగ్గకుండా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు..

స్కానింగ్ సెంటర్ నిర్లక్ష్యం వల్ల తమకు జరిగిన అన్యాయంపై బాధిత కుటుంబ సభ్యులు డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశారు. తప్పుడు రిపోర్టులు ఇచ్చిన సదరు సెంటర్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై డీఎంహెచ్‌వోను ‘విజయక్రాంతి’ వివరణ కోరగా.. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, తప్పు ఎక్కడ జరిగిందో నిర్ధారించుకుని తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ఓ కమిటీ వేసినట్లు సమాచారం.