హైదరాబాద్,(విజయక్రాంతి): బైబ్యాక్ స్కీమ్ కింద గోల్డ్ చిట్స్ పేరిట అమాయకల నుంచి డిపాజిట్లు వసూలు చేసిన 8 మంది నింధితులను సైబరాబాద్ ఆర్థిక విభాగం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తమ కంపెనీ 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ గోల్డ్ స్కీమ్ లలో పెటుబడులు పెడితే అధిక మొత్తంలో చెల్లిస్తామని అమాయక ప్రజలకు ఆశ కల్పించారు. డబుల్ గోల్డ్ స్కీమ్ కింద రూ.4లక్షల వరకు పెట్టుబడి పెడితే 12 నెలలు పూర్తవగానే చివర్లో రూ. 8 లక్షలు విలువైన స్విట్జర్లాండ్ ముద్ర ఉన్న బంగారం బిస్కెట్లను అదిస్తామన్నారు.
ఇంకా 20 నెలల ప్లాన్ కింద రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే 19 నెలల పాటు 3 శాతం వడ్డీతో నెలకు 15 వేలు చొప్పున డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. చివరి నెలలో పెట్టుబడి మొత్తం తిరిగి చెల్లిస్తామని చెప్పడంతో దాదాపు 3600 మంది నుంచి రూ.300 కోట్ల డబ్బులు కాజేసినట్లు సైబరాబాద్ ఆర్థిక విభాగం పోలీసులు వెల్లడించారు. దీంతో కూకల్ పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన బాధితుడు నాయని హరికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు దర్యాప్తు చేశారు. 12 వెల్త్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ లకు చెందిన నిర్వాహకులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.