calender_icon.png 6 November, 2024 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధరణి పేరుతో దగా

03-08-2024 04:09:42 AM

  1. కొత్త భూ చట్టం ముసాయిదాను ప్రజల ముందు ఉంచుతున్నాం
  2. ౩ వారాలపాటు అభిప్రాయాలను తీసుకుంటాం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో భూమాత చట్టాన్ని ప్రవేశపెడుతాం
  3. ధరణి మూడు తలలతో.. మొదలై 33 తలతో భూతమైంది ఆ పెద్దాయన, ఓ అధికారి తెచ్చిన పోర్టల్ ఇది
  4. ధరణితో ప్రతి ఊరిలో భూ సమస్య
  5. అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన ధరణి పోర్టల్  లోపభూయిష్టంగా మారిందని, దీనివల్ల లక్షలాది మంది రైతులు నష్టపోయారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ధరణికి ప్రత్యామ్నాయంగా తీసుకొస్తున్న కొత్త భూ చట్టం డ్రాఫ్ట్ ఇప్పటికే సిద్ధమైందని, దీన్ని శుక్రవారం నుంచి  www.ccla.telangana.gov.inలో ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామ న్నారు. మూడు వారాలపాటు అంటే ఆగస్టు 23వ తేదీ వరకు ప్రజలు నుంచి అభిప్రాయాలను తీసుకోనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అన్ని వర్గాల నుంచి వచ్చిన సూచనలను తీసుకున్న తర్వాత వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో భూమాత బిల్లును ప్రవేశపెడుతామని స్పష్టం చేశారు.

శుక్రవారం అసెంబ్లీలో భూ సంస్కరణల అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, 1969లో ఇందిరా గాంధీ పెద్దఎత్తున భూసంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. 2014కు ముందుకు జరిగిన అన్ని భూ సంస్కరణలు సామాన్య రైతన్నకు కూడా ఎంతో మేలుచేశాయని మంత్రి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో భూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ 2007 లోనే ప్రారంభమైందని, 2009లో మీ-సేవా కేంద్రాల్లో రెవెన్యూ సేవలు అందు బాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఆ తర్వాత 2011 ‘మా భూమి’ పోర్టల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చి, భూ రికార్డులు పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ రూపంలోకి తీసుకొచ్చినట్లు మంత్రి గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మా భూమి స్థానంలోనే ధరణిని తీసుకొచ్చినట్లు మంత్రి చెప్పారు. రాష్ర్టంలో 10,954 రెవెన్యూ గ్రామాలు ఉంటే, వాటిలో భూ సమస్య లేని గ్రామం లేదన్నారు.

ఇద్దరు వ్యక్తులు చేసిన కుట్ర ధరణి

ధరణిని తీసుకురావడం వల్ల.. కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిందన్న చందంగా రైతుల పరిస్థితి తయారైందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ప్రభుత్వం 2020 అక్టోబర్‌లో తెచ్చిన ధరణి పోర్టల్ దారి తప్పిందన్నారు. తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందన్నారు. అపర మేధావిగా చెప్పుకున్న గత సీఎం, 80 వేల పుస్తకాలు చదివి అపర జ్ఞానిగా గొప్పలు చెప్పుకున్న కేసీఆర్.. ధరణి పేరుతో ప్రజలను దగా చేశారన్నారు. ఓ పెద్దాయన, ఆయన అనుచర అధికారి ఒక గదిలో చేసిన కుట్రే ఈ ధరణి అన్నారు.  

బీఆర్‌ఎస్ హయాంలో భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో సుమారు 18 లక్షల ఎకరాల భూమిని చిన్న చిన్న కారణాలతో రికార్డులకు ఎక్కించలేదని మంత్రి వెల్లడించారు. ధరణి వల్ల దాదాపు 30 లక్షల మంది రైతులు బాధితులుగా మారినట్లు వివరించారు. ధరణి చట్టంతో వచ్చిన సమస్యల వల్ల దాదాపు 20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. ఇందులో కనీసం పరిశీలంచకుండానే కనీసం 10లక్షల దరఖాస్తులను తిరస్కరించారని దుయ్యబట్టారు.

గ్రామస్థాయిలో అసలు రెవెన్యూ వ్యవస్థను లేకుండా చేశారని, ఫలితంగా సేవలు అందని ద్రాక్షగా మారాయన్నారు. ప్రపంచానికే ఆదర్శంగా ఉండే అద్భుతమైన చట్టం తీసుకొస్తున్నామని చెప్పి.. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, రెవెన్యూ కేసుల పరిష్కారాలను మూడు నెలలు పూర్తిగా నిలిపేశారని ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. 

రైతు నేస్తంగా కొత్త చట్టం

ధరణి ఏర్పాటు వచ్చిన సమస్యలను అన్నింటిని పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. భూ చట్టాన్ని ప్రజానుకూలంగా మార్చి రైతు కంట్లో ఆనందాన్ని చూడడం తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ధరణిని రైతు కోణంలో సంస్కరించాలని తమ సర్కారు నిర్ణయించినట్లు చెప్పారు. ఇందుకోసం విస్తృత కసరత్తు చేస్తున్నామన్నారు. కొత్త చట్టం పూర్తిగా రైతు నేస్తంగా ఉండబోతున్నదన్నారు. రైతు విశ్వాసాన్ని పొందేందుకే అందరి సలహాలను తీసుకుంటున్నామన్నారు. ఎలాంటి బేషజాలకు పోకుండా, అవసరమైతే ధరణిలో మంచి విషయాలను తీసుకొని, మేలైన సలహాలను తీసుకొని కొత్త చట్టాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు.

తమది దొరల ప్రభుత్వం కాదన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు.  మంచి సలహాలను బీఆర్‌ఎస్ చెప్పినా వింటామని, చెట్టుకింద కూర్చున్న రైతు చెప్పినా వింటామన్నారు. రాష్ట్రంలో ధరణి రూపంలో చిచ్చుపెట్టిన దొరలు వేల కోట్లు దోచుకుని తమ గడీలను ధన రాశులతో నింపుకున్నారని, తెలంగాణలోని ప్రతి కుటుంబం ఉసురు తగిలి, ఇప్పుడు గడీలోనే బందీ అయ్యారని విమర్శించారు. 

ధరణి రికార్డుల సవరణ అధికారం ఎవరికీ లేదు

ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ధరణి రికార్డుల సవరణకు కలెక్టర్‌కు అధికారం లేదన్నా రు. ప్రతి సమస్య పరిష్కారానికి కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనని స్పష్టం చేశారు. దీనివల్ల రాష్ట్రంలో సివిల్ కేసులు భారీగా పెరిగినట్లు వెల్లడించారు. ఒక్కప్పుడు రైతుకు భూమికి సంబంధించి ఏ కష్టం వచ్చినా రెవెన్యూ కార్యాలయాల్లో పరిష్కారం దొరికేదని, కానీ ఇప్పుడు అలా లేదన్నారు. రైతులు రూ. వేలు ఖర్చుపెట్టుకొని చెప్పులు అరిగేలా కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనన్నారు.

గత ప్రభుత్వం సాదాబైనామాల క్రమబద్ధీకరణ కోసం 2020లో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించిందని, కానీ వాటి అంశాన్ని ధరణిలో ప్రస్తావించకుండా మోసం చేసిందన్నారు. కొత్తం చట్టంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఎలాంటి నిబంధన పెట్టలేదన్నారు. చట్టంలో నిబంధన లేకపోవడంతో 6,74,201 దరఖాస్తులపై హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. దీని వల్ల 9లక్షలకు పైగా చిన్న, సన్నకారు రైతులు మూడేళ్లుగా ఎదురు చూస్తున్నారన్నారు. 

మేమొచ్చాక మార్పులు చేశాం

ధరణిని నిర్వహించే విధానంలో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో మార్పులు తీసుకువచ్చామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ధరణి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రీకృతమై ఉన్న అధికారాలను వికేంద్రీకరించామన్నారు. మండల స్థాయిలో తహశీల్దార్‌కు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓలకు, జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్లకు సమస్యలను పరిష్కరించే అధికారాన్ని అప్పగించామన్నారు.

నాటి ప్రభుత్వంలో ఏ కారణం చెప్పకుండానే దరఖాస్తులను తిరస్కరించేవారని, తాము వచ్చిన తర్వాత.. ఎందుకు తిరస్కరిస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 2.48 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, తమ హయాంలో మరో 1.84 లక్షలు వచ్చాయని చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల గడచిన ఏడు నెలల్లోనే 2.76 లక్షల దరఖాస్తులను పరిష్కారమయ్యాయన్నారు. 

మీరు గోకితే.. నేనూ గోకుతా.. 

బీఆర్‌ఎస్‌ను విమర్శిస్తూ.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంపై ఆ పార్టీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పొంగులేటి స్పందించారు. మీరు గోకితే.. నేనూ గోకుతా పొంగులేటి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌తో 10 గంటలు కూర్చుంటే మాట్లాడే అవకాశమే ఇవ్వరన్నారు. రాష్ట్ర విభజన సమయానికి సుమారు 23,500 మందితో వీఆర్‌ఏ, వీఆర్‌ఓల వ్యవస్థ ఉందన్నారు. బీఆర్‌ఎస్ వచ్చిన తర్వాత.. దానిని మొత్తం నిర్వీర్యం చేశారన్నారు.

ఆర్వోఆర్ చట్టాలను అధ్యయనం చేశాకనే.. 

కొత్త భూ చట్టం ముసాయిదాను రూపొందించే క్రమంలో 1936, 1948, 1971, 2020లో వచ్చిన ఆర్వోఆర్ చట్టాలను లోతుగా అధ్యయనం చేశామని మంత్రి పేర్కొన్నారు. అలాగే 18 రాష్ట్రాల్లో అమలులో వున్న ఆర్వోఆర్ చట్టాలను కూడా పరిశీలించామన్నారు. రాబోయే ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ముసాయిదా తీర్చిదిద్దినట్లు వివరించారు. విస్తృత ప్రజాభిప్రాయం, అసెంబ్లీలో చర్చ తర్వాత కొత్త చట్టాన్ని కూడా తీసుకొస్తామన్నారు. 

లోపాలు ఉంటే సరిచేయండి.. ధరణి పేరును మార్చొద్దు: పల్లా రాజేశ్వర్ రెడ్డి

ధరణిలో ఉన్న లోపాలను సవరించాలని, కానీ కేసీఆర్ పెట్టిన ఆ పేరును అలాగే కొనసాగించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. నాలుగు గోడల మధ్య నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎన్నో సమస్యలకు ధరణి పరిష్కారం చూపిందన్నారు. భూమి హక్కును రైతులకు అందించే ఉద్దేశంతో కేసీఆర్ ధరణిని తీసుకొచ్చాని పేర్కొన్నారు. 

ధరణితో రైతుల్లో భయం కల్పించారు: మంత్రి సీతక్క

బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చి రైతుల్లో భయం కల్పించిందని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పేరుతో అనుభవదారు  కాలం తొలగించి పేద రైతులకు అన్యాయం చేశారన్నారు. భూములు అమ్ముకున్న వారికి తిరిగి పట్టాలు ఇచ్చారన్నారు. నాయకులు తమ పేరు మీద భూములు రాసుకుని రైతుబంద్‌తో ఎంజాయ్ చేశారన్నారు. ములుగుకి వస్తే తప్పులను నిరుపిస్తానని బీఆర్‌ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. పేద రైతుల హత్యలు, అత్మహత్యలకు ధరణి కారణమన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ చట్టానికి తూట్లు పొడిచిందన్నారు.  పేదల అసైన్డ్ భూములను గుంజుకున్నదన్నారు. రైతుల ఆవేదన తొలగించేలా, భూములపై హక్కులు కల్పిస్తూ సమగ్ర చట్టం తీసుకొస్తామన్నారు.