19-03-2025 01:21:14 AM
ఎల్బీనగర్, మార్చి 18 : బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇదే నియోజకవర్గంలోని హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ బానోతు సుజాతా నాయక్ పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశాడని సోమవారం కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి కార్పొరేటర్ సుజాత నాయక్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.
మంగళవారం డీసీపీ ప్రవీణ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం మహిళా కమిషన్ చైర్ పర్సన్ శారదకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు Cr. No. 254/2025 U/s Sec. 3(2)(va), 3(1)(r)(w)(ii) SC/ST POA Act, 1989 & Sec. 79 bns ప్రకారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ నెల 12న మనసురాబాద్ డివిజన్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రోటోకాల్ ప్రకారం జిహెచ్‌ఎంసి అధికారులు స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి కి సమాచారం అందించారు.
ఆ సమయంలో కార్పొరేటర్ హాజరు కాలేదు. అనంతరం ఇవే అభివృద్ధి పనులకు ఈనెల 17న కార్పొరేటర్ నర్సింహారెడ్డి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే శంకుస్థాపన చేశాక తిరిగి కార్పొరేటర్ ఎలా శంకుస్థాపన చేస్తారని బీఆర్‌ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకొని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పోలీస్ స్టేషన్ కు వెళ్లి అరెస్ట్ అయిన వారిని పరామర్శించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ బిజెపి కార్పొరేటర్లతో హనీమూన్ చేస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో స్పందించిన కార్పొరేటర్ సుజాత నాయక్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తనకు తన కుటుంబానికి తీవ్ర మనోవేదనకు గురి చేసిందన్నారు. తనకు సంబంధం లేని మన్సూరాబాద్ డివిజన్లో జరిగిన గొడవకు తనకు ప్రమేయం ఉన్నట్లు మాట్లాడడం ఏమిటని? ప్రశ్నించారు.
గిరిజనురాలైన తనకు ఇలాంటి మాటల ద్వారా మానసిక క్షోభ కలిగించాడని ఆరోపిస్తూ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైనట్లు ఎల్బీనగర్ సీఐ వినోద్ కుమార్ తెలిపారు.