calender_icon.png 19 April, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ వెంటనే చేపట్టాలి

16-12-2024 09:59:00 PM

బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి డిమాండ్...

ముషీరాబాద్ (విజయక్రాంతి): బేడ (బుడగ) జంగాల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామని బేడ(బుడగ) జంగం హక్కుల పోరాట సమితి హెచ్చరించింది. ఈ మేరకు సోమవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సిరిగిరి మన్నెం, అధ్యక్షుడు కోడిగంటి నర్సింహ, సంఘం సీనియర్ నాయకులు కడమంచి సహదేవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ రిజర్వేషన్ కు వర్గీకరణ చేయాలని, ఇందులో అల్ప సంఖ్యాక కులాల విద్యా, ఉద్యోగ రంగాలలో నష్టపోకుండా న్యాయం చేయాలని కోరారు. కమీషన్ల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయకుండా వెంటనే వర్గీకరణను చేపట్టాలన్నారు.

వర్గీకరణలో సంచార కులాలను ఒక గ్రూప్ ఏర్పాటు చేసి రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని కోరారు. ఈ కులాలకు ప్రత్యేకంగా ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఏర్పాటు చేయాలని, ఆ కార్పొరేషన్స్ కు బేడ, బుడగ జంగాల వ్యక్తినే చైర్మన్ గా నియమించాలన్నారు. విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో వాటా కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈనెల 30న తమ సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్బంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని, ఇందులో భవిష్యత్తు కార్యచరణను రూపొందిస్తామని అన్నారు. ఈ సమావేశంలో సమితి నాయకులు తూర్పాటి శ్రీనివానులు, కడమంచి సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.