ఎస్సీ సంక్షేమానికి మంత్రి లేడు
2 వేల మంది ఉద్యోగుల తొలగింపు
3 నెలలుగా జీతాలు కరువు
ఆపై అరెస్టులు.. వేధింపులు
దళితుడు డిప్యూటీ సీఎంగా ఉన్నా ఒరిగిందేమీ లేదు
బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయ క్రాంతి): ఎస్సీ గురుకులాలు సమస్యల కేంద్రాలుగా మారటానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఎస్సీ గురుకులాల్లో నెలకొన్న దారుణ పరిస్థితులతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అట్టడుగు వర్గాల పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగే లక్ష్యంతో స్థాపించిన గురుకులాలు నేడు సమస్యల వలయంలో చిక్కుకున్నాయని తెలిపారు. ఎస్సీ గురుకులాల్లో సరైన వసతులు లేక విద్యార్థులు.. బదిలీల ప్రక్రియ, జీతాల్లేక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. ఎస్సీ సంక్షేమ శాఖ, ఎస్సీ గురుకులా ల్లోని సమస్యలపై ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ గురువారం ‘విజయ క్రాంతి’తో మాట్లాడారు.
శాఖకు మంత్రి ఎక్కడ?
ఎస్సీ సంక్షేమ శాఖలో తలెత్తున్న సమస్యలకు ప్రధాన కారణం సంబంధిత మంత్రిని ఇప్పటి వర కూ నియమించకపోవడమేనని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. మంత్రి లేకపోవడంతో అనేక దారుణాలకు ఎస్సీ సంక్షేమ శాఖ కేంద్ర బిం దువుగా తయారైందని చెప్పారు. ఎప్పటికప్పుడు శాఖాపరమైన సమీక్షలు, పురోగతిపై శ్రద్ధ చూపేందుకు మంత్రి లేకపోవడంతో అధికారుల మధ్య సమన్వయం లోపిస్తుందని తెలిపారు. తద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా వ్యవహరించాల్సిన మంత్రిని నియమించడంపై ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందని ప్రశ్నించారు. అధికారులను గైడ్ చేయాల్సిందే మంత్రి అని, అలాంటిది ఎస్సీ సంక్షేమ శాఖకు మంత్రే లేకపోవడం దారుణమని విమర్శించారు. మంత్రి నియామకంపై ప్రభుత్వ తీరుతో ఎస్సీ వర్గాలపై వారికున్న చిత్తశుద్ధి స్పష్టంగా అర్థమవుతుందని మండిపడ్డారు.
అధికారుల ఏకపక్ష నిర్ణయాలు
శాఖకు మంత్రి లేకపోవడంతో పర్యవేక్షణ లోపించి శాఖకు సంబంధించిన అధికారులంతా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్సీ గురుకులాల్లోని సమస్యలకు అధికారుల తీరే కారణమని ఆరోపించారు. గురుకులాల్లో కనీస వసతులు లేక లక్షలా ది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నా.. అధికారుల తీరులో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాఠశాలలకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు అనేక బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో సమయానికి వారు సరుకులు అందించడం లేదని తెలిపారు. దీంతో విద్యార్థులకు సరైన భోజనం కూడా అందని దుస్థితి దాపు రించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో ఎస్సీ గురుకుల విద్యార్థుల కోసం స్పోర్ట్స్ అకాడమీ, కోడింగ్ అకాడమీ, స్పెషల్ అకాడమీ వంటివి అందుబాటు లోకి తీసుకొస్తే, ఇప్పుడు వాటన్నింటినీ మూసేసి విద్యార్థులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. కొద్దిరోజుల్లో చలి కాలం మొదలవుతున్నా.. ఇప్పటికీ గురుకులాల్లోని విద్యార్థులకు రగ్గులు అందించ లేదని, బీఆర్‌ఎస్ హయాంలో దసరాకు ముందే విద్యార్థులకు రగ్గులు అందించామని గుర్తు చేశారు. ఎస్సీ గురుకులానికి సంబంధించిన ఉన్నతాధికారులు ఆడిందే ఆట.. పాడిందే పాట చందాన వ్యవహరించి విద్యార్థులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతులపై ప్రశ్నిస్తే విద్యార్థుల తల్లిదండ్రులను కూడా అరెస్టు చేయించడం అధికారులు దాష్టీకానికి నిదర్శనమని మండిపడ్డారు.
దళిత డిప్యూటీ సీఎంతో ఒరిగిందేమిటి?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పేరుకే దళితుడిని డిప్యూటీ సీఎంను చేసిందని, ఆయన డిప్యూటీ సీఎం కావడం వల్ల ఆ సామాజికవర్గానికి ఒరిగిందేమీ లేదని ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఎస్సీ సంక్షేమం కోసం ప్రభుత్వం కొత్తగా ఏమీ చేయాల్సిన అవసరం లేదని, ఉన్న వాటిని చెడగొట్టకుం డా ఉంటే చాలని అన్నారు. దళిత సామాజికవర్గానికి చెందిన డిప్యూటీ సీఎం ఉన్నప్పటికీ ఎస్సీ సంక్షేమ శాఖలో, గురుకులాల సమస్యలపై నోరు మెదపకపోవడం దారుణమని విమర్శించారు. దళితుడిని డిప్యూటీ సీఎం చేసినా, ఎస్సీల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న ద్వేషపూరిత తీరులో ఏ మార్పు లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేకంగా దృష్టి సారించి ఎస్సీ సంక్షేమ శాఖకు మం త్రిని నియమించటంతోపాటు విద్యార్థుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా చర్య లు తీసుకోవాలని సూచించారు.
సీఎం రేవంత్‌రెడ్డి పట్టింపేది?
ఎస్సీ గురుకులాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు పడుతుందటే శాఖకు బాధ్యుడైన సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. కనీసం ఎస్సీ సంక్షేమ శాఖ పురోగతిపైన సమీక్షా సమావేశం నిర్వహించేందుకు కూడా సీఎంకు సమయం లేకపోవడం బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన లో ఎస్సీ వర్గాలపై మళ్లీ రాతియుగపు పొకడలను అవలంభించే ప్రమాదం ఉందని ఆందో ళన వ్యక్తం చేశారు. ఎస్సీ సంక్షేమ శాఖలో నెలకొన్న సమస్యలను పట్టించుకునే తీరిక కూడా సీఎం రేవంత్‌రెడ్డికి లేకపోవడం దారుణమని విమర్శించారు. గురుకులాల్లో ఉన్నతాధికారు లు నచ్చినవారికి బదిలీలు, పదోన్నతులు ఇస్తున్నా ప్రభుత్వం దృష్టి సారించడం లేదని, పోస్టింగుల్లో అవకతవకలు జరగుతున్నా చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు.
మూడు నెలలుగా జీతాల్లేవు
ఎవరిని సంప్రదించకుండానే, ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండానే రాత్రికి రాత్రి 2 వేల మంది ఎస్సీ గురుకులాల ఉద్యోగులను తొలగించడం దారుణమని ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యతో ఉపాధ్యాయుల కుటుంబాలు రోడ్డున పడటానికి ఉన్నతాధికారులు కారణమయ్యారని ఆరోపించారు. బాధితులు ఎన్నో రోజులు ధర్నాలు చేసినా పట్టించుకోలేదని, చివరకు తాము ముందుకొచ్చి కొట్లాడితేనే తిరిగి వారి ని విధుల్లోకి తీసుకున్నారని తెలిపారు. విధుల్లోకి తీసుకున్నా.. మూడు నెలలుగా వారికి జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాల గురించి అడిగితే ఉద్యోగులను కూడా అరెస్టు చేయిస్తున్నారని, అధి కారుల తీరుతో ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాల యం ఆర్మీ క్యాంపును తలపిస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా స్టాఫ్‌కు పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.