10-02-2025 04:42:15 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు(Supreme Court) వాయిదా వేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ నిర్ణయంలో జాప్యం జరిగిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KT RamaRao) సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన పిటిషన్‌లో తెలంగాణ స్పీకర్, ఎమ్మెల్యేలు పి. శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి. ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం. సంజయ్ కుమార్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ కేసును జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
అసెంబ్లీ కార్యదర్శి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి స్పీకర్ నుండి సమాచారం పొందడానికి మరింత సమయం కావాలని ధర్మాసనాన్ని కోరారు. "ఈ విషయాన్ని స్పీకర్‌తో చర్చించడానికి అవసరమైన వివరాలను అందించడానికి మాకు మరింత సమయం కావాలి" అని ఆయన అన్నారు. ఇప్పటికే 10 నెలలు పూర్తయిందని, ఇంకా ఎంత సమయం కావాలి? అని కోర్టు ప్రశ్నించింది. ముకుల్ రోహత్గి విజ్ఞప్తితో జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.