calender_icon.png 24 October, 2024 | 9:56 PM

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్

24-10-2024 07:37:14 PM

గజ్వేల్,(విజయక్రాంతి): గజ్వేల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ నగరి ప్రీతమ్ గురువారం సందర్శించారు. డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ శ్రీరాంరెడ్డి, నాయకులతో కలిసి గజ్వేల్ పాలిటెక్నిక్ కళాశాల, వసతిగృహాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కళాశాల, హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కళాశాలలో చాలా ఏండ్లుగా ప్రయోగశాలలో వినియోగిస్తున్న యంత్రాలు, పనిముట్లు తుప్పుపట్టి పాడైపోవడమే కాకుండా కళాశాల, ప్రయోగశాల గదులు పూర్తిగా పాతబడ్డాయని, చాలావరకు దెబ్బతిన్న పైకప్పులను ప్రీతమ్ పరిశీలించారు. 2002-05 వరకు ఇదే కళాశాలలో తాను పాలిటెక్నిక్ విద్యను పూర్తి చేశానని, ప్రతి తరగతి తిరుగుతూ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. గురువారం రాత్రంతా హాస్టల్లో విద్యార్థులతోనే గడపుతానని, ఉదయం సమస్యల పరిష్కారానికి అవసరమైన కార్యచరణను వెల్లడించనున్నట్లు ప్రీతమ్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ ప్రీతమను శాలువలతో ఘనంగా సత్కరించారు. కాగా పాలిటెక్నిక్ కళాశాల ముందు హోటల్ నిర్వహించే మహ్మద్ వలీ అనే వృద్ధులు ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ ప్రీతమ్ రాగానే వచ్చి పలుకరించాడు. వృద్ధున్ని చూసిన ప్రీతమ్ కైసాహై చాచా అంటూ దగ్గరికి తీసుకుని గట్టిగా హత్తుకున్నారు. కాసేపు ఆయనతో ముచ్చటించారు.