calender_icon.png 7 January, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించాలి

02-12-2024 12:47:12 AM

ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మాలలు ఐక్యంగా పోరాడాలి: ఎంపీ మల్లు రవి

హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): మాలలు ఐక్యంగా పోరాడి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన మాలల సింహగర్జన సభకు ఆయన హాజరై మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అని రాహుల్ గాంధీ అంటున్నారని.. మాలలకు 20 శాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం క్రిమిలేయర్ తీసుకొచ్చేందుకు చూస్తున్నారని, మున్ముందు రిజర్వేషన్లు తొలగించే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. మాలలకు వ్యతిరేకంగా మాట్లాడే పార్టీలకు, నాయకులకు ఈ సభ హెచ్చరిక అన్నారు. బాబా సాహెబ్‌ను విమర్శిస్తే మాలలు ఊరుకోరని హెచ్చరించారు. తాను పదవుల కోసం ఆరాటపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. సంఖ్యాబలం ఒకటే సరిపోదు.. జాతిలో విద్యావంతులు కావాలన్నారు.

ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ.. గడ్డం ఫ్యామిలీ అంటే టాటా బిర్లా అనే ఆరోపణలు చేస్తారు కాని వివేక్ కంపెనీ పెట్టి వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారని స్పష్టం చేశారు. మాలలకు వివేక్, వినోద్ అండగా ఉంటారని స్పష్టం చేశారు. మాలసభ నాయకుడు పాశ్వాన్ మాట్లాడుతూ.. పార్లమెంట్ లో మాలల రిజర్వేషన్లపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ మైదానానికి వచ్చినట్టే ఢిల్లీకి కూడా రావాలని పిలుపునిచ్చారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. ప్రభుత్వసెక్టార్‌లోనే కాదు.. ప్రైవేట్ సెక్టార్‌లోనూ రిజర్వేషన్లు ఉండాలని డిమాండ్ చేశారు. సుప్రీం నిర్ణయంపై మాల, మాదిగలు కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.