ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 5 (విజయక్రాంతి): సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్రంలో తక్షణమే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనవరి 9న తలపెట్టనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ హబ్సీగూడలోని ఓ హోటల్‌లో మంగళవారం రాష్ట్రస్థాయి సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. రాష్ట్రంలో వర్గీకరణ తర్వాతనే ఉద్యోగ నియామకాలు చేపడతామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. మాలల ఒత్తిడికి తలొగ్గి వర్గీకరణ లేకుండానే నియామకాలు చేపడుతున్నారని ధ్వజమెత్తారు.
చలో హైదరాబాద్ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా మాదిగలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ డీన్ ప్రొ.మల్లేశం, ఎమ్మార్పీఎస్ గౌరవ అధ్యక్షుడు సండ్రపల్లి వెంకటయ్య, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులిజాల గెలవయ్య తదితరులు పాల్గొన్నారు.