calender_icon.png 28 November, 2024 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ వేగవంతం

28-11-2024 02:09:59 AM

  1. 4 నుంచి జిల్లాలకు వన్‌మ్యాన్ కమిషన్
  2. బహిరంగ విచారణ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ
  3. సమాచారం కోసం ఇప్పటికే అన్ని శాఖలకు లేఖలు

హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ముమ్మరంగా కొనసాగుతోం ది. ప్రజల సామాజిక, రాజకీయ, విద్య, ఉపా ధి, కులగణన స్థితిగతులకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. దీంతోపాటు స్థాని క సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ అంశా న్ని తేల్చేందుకు హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా డెడికేటెడ్ కమిషన్‌ను కూడా నియమించింది.

ఒక వైపు బీసీల కులగణన, స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల అమలుపై రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కూడా ఊపందుకుంది. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వన్‌మ్యాన్ కమిషన్‌ను కూడా ప్రభు త్వం అక్టోబర్‌లో నియమించింది.

ఈ కమిషన్ చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్. షమీమ్ అక్తర్ వ్యవహరిస్తున్నారు. నవంబర్ 11వ తేదీన వన్‌మ్యాన్ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ షమీమ్ బాధ్యతలు స్వీకరించారు. రెండు నెలల నిర్ణీత గడువులోగా నివేదిక సమర్పించాలని  కమిషన్‌కు రాష్ట్ర ప్రభు త్వం సూచించింది.

ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విచారణను కమిషన్ వేగవంతం చేసింది. ప్రభుత్వం నిర్దేశిం చిన గడువులోగా నివేదిక సమర్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

డిసెంబర్ 4 నుంచి జిల్లాల పర్యటన..

అయితే ఎస్సీ కులాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంపై కమిషన్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల్లోని అన్ని విభాగాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 యూనివర్సిటీలకు కమిషన్ తరఫున లేఖలు రాసింది. అన్ని శాఖలకు కలిపి మొత్తం 3 వేలకుపైగా లేఖ లు పంపించినట్టు సమాచారం.

ఎస్సీ కులా ల జనాభా, వారి విద్య, ఉపాధి అవకాశాల వంటి అంశాల గురించిన సమాచారం పంపించాలని కోరినట్టు తెలుస్తోంది. అయి తే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తిచేయాలనే ప్రభుత్వ సూచనలో భాగం గా జనవరి 10వ తేదీతో ఏక సభ్య కమిషన్ గడువు పూర్తవుతుంది. దీంతో వర్గీకరణ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ విచారణ జరపాలని కమిషన్ నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో డిసెంబర్ 4వ తేదీ నుంచి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బహిరంగ విచారణ చేపట్టనున్నది. ఈ బహిరంగ విచారణను మొదట సంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభించనున్నట్టు సమాచారం. బహిరంగ విచార ణలో భాగంగా వినతులు స్వీకరించే సమయంలో ప్రత్యక్షంగా ప్రజల అభిప్రాయం తెలుసుకునే అవకాశం లభిస్తుందని కమిషన్ అభి ప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న కులగణన నివేదిక కూడా ఎస్సీ వర్గీకరణకు ఎంతో ఉపయోగపడనుంది. 

తెరపైకి క్రిమీలేయర్ డిమాండ్..

2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జాబితాలో మొత్తం 59 కులాలున్నాయి. వీటిలో మాదిగ సామాజికవర్గం జనాభా 32 లక్షలకుపైగా ఉంది. మాలలు 15 లక్షలకుపైగా ఉన్నారు. బేడ, బుడగ జంగాలు లక్ష మంది, నేతకాని లక్షా 33 వేల మంది ఉన్నారు. వీరు మినహాయిస్తే గోసంగి 23 వేలు, మహార్ 31 వేలు, మన్నె 29 వేలు, మాంగ్ 13 వేలు, బైండ్ల 13 వేలు, చమార్ 13 వేలు, మిగతా కులాలన్ని వెయ్యి లోపు జనాభా కలిగిన వారే ఉన్నారు.

జనాభా గణాంకాలు ఇలా ఉండగా ఇప్పటికే వన్‌మ్యాన్ కమిషన్ ఎస్సీ వర్గీకరణలో భాగంగా వినతుల స్వీకరణ ప్రారంభించింది. ఆయా కులాలకు చెందిన ప్రతినిధులు హైదరాబాద్ బీఆర్‌కేఆర్ భవన్‌లోని కమిషన్ కార్యాలయానికి వచ్చి విన తులు ఇస్తున్నారు.

అయితే ఇప్పటివరకు వచ్చిన వినతులను పరిశీలిస్తే మాదిగ వర్గానికి చెందినవారు వర్గీకరణను స్వాగతిస్తూ వినతులిస్తున్నప్పటికీ మాలలతోపాటు, ఇతర ఎస్సీ జాబితా లోని కులాల వారు వర్గీకరణ ప్రక్రియను క్రిమీలేయర్ ప్రకారం చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

జనాభా పరంగా తక్కువగా ఉండటంతోపాటు ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయంగా వెనుకబడుతున్నామని కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తున్నట్టు సమా చారం. ప్రస్తుతం మాదిగలు మినహా ఇతర ఎస్సీ కులాలు తెరపైకి తీసుకొస్తున్న క్రిమీలేయర్ డిమాండ్ వర్గీకరణ ప్రక్రియలో కీలకంగా మారునున్నది.