20-03-2025 02:30:15 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 19 (విజయక్రాంతి): ఎమ్మార్పీఎస్ 30 ఏండ్ల పాటు సుదీర్ఘంగా చేసిన ఉద్యమాల ఫలితంగా ఎస్సీ వర్గీకరణ చట్టం ఏర్పడిందని ఎమ్మార్పీఎస్ వ్యకస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన సందర్భంగా బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. బిల్లును ఆమోదించిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు కృతజ్ఞత లు తెలిపారు.
రాష్ట్రంలో వచ్చిన చట్టం ఎవరి దయా దాక్షిణ్యాలతో రాలేదని, ఉద్యమాలతో వచ్చిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ మాలల ఒత్తిడికి గురై రాబోయే పదేండ్లపాటు గ్రూప్ పోస్టులు మాదిగలకు దక్కకుండా అన్యాయం చేశారని ఆరోపించారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టే నాలుగు రోజుల ముందే అన్ని పోటీ పరీక్షల ఫలితాలు ఎందుకు ఆగమేఘాలపై విడుదల చేశారో సమాధానం చెప్పాలన్నారు. ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ వేశారని, రెండో దఫా అభిప్రాయాలు సేకరించారన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టం జరగడంతో నెల రోజుల పాటు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విజయోత్సవ సభలు నిర్వహించాలని కృష్ణమాదిగ పిలుపునిచ్చారు.