- అందుకే అన్ని వర్గాల మద్దతు
- మేధావులపై విమర్శలు సరికాదు
- ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్‌మాదిగ
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17(విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ న్యాయమైంది కాబట్టే అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్ మాదిగ పేర్కొన్నారు. శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదుట నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్‌మాదిగతో కలిసి మాట్లాడుతూ..
వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాలలు ఏకాకిగా నిలుస్తున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలిచిన ప్రొఫెసర్ కోదండరాం, డాక్టర్ జయప్రకాశ్ నారాయణ, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ నాగేశ్వర్, కే శ్రీనివాస్, నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, డాక్టర్ పృథ్వీరాజ్, తెలంగాణ విఠల్, విమలక్క, నల్గొండ గద్దర్, సయ్యద్ ఇస్మాయిల్ తదితర మేధావులపై అల్లరిమూకల్లా విమర్శలు చేయడం సరికాదని విమర్శించారు.
ఎస్సీ వర్గీకరణను ఎందుకు వ్యతిరేకించాలో చర్చపెట్టి మేధావుల మద్దతు పొందాలిగానీ బూతులు, విషపు రాతలు సరికావన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌ఎఫ్ నాయకులు ఇనుముల అనిల్ మాదిగ, రొట్టెల సునీల్ మాదిగ, అజయ్ మాదిగ, దావు ఆదిత్య మాదిగ, బొల్లికొండ వేణుమాదిగ, నర్వ దాసు మాదిగ పాల్గొన్నారు.