21-03-2025 01:18:13 AM
మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్
కరీంనగర్, మార్చి 20 (విజయక్రాంతి): సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆమోదం తెలిపారని మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ అన్నారు. గురువారం కరీనగర్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాదిగలు మందకృష్ణ మాదిగ మాటలను నమ్మవద్దని తెలిపారు.
బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి చేయని సందర్భంలో చిట్టచివరికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుకూలంగా ఏబీసీడీ వర్గీకరణ చేయాలనే సదుద్దేశంతో స్వయంగా శాసనసభలో వర్గీకరణ చేస్తామని చెప్పారని అన్నారు.
సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు కట్టుబడి వన్ మెన్ కమిషన్ వేయడంతోపాటు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమమైన న్యాయవాదులను నియమించి వారికి తగిన ఫీజు చెల్లించి కోర్టులో కేసు గెలవడానికి రేవంత్ రెడ్డి చొరవ తీసుకున్నారని అన్నారు.
ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా ఏబీసీడీ వర్గీకరణ చేయడానికి అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యేలా చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో-చైర్మన్ దామోదర రాజనరసింహ, సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్రంలో మాల, మాదిగ, నేతకాని, బుడిగజంగాలు ఈ నాలుగు జాతులే అన్నిరంగాల్లో ముందున్నాయని అన్నారు.
ఏబీసీడీ వర్గీకరణ ద్వారా ఎలా లాభం జరుగుతుందో కొందరికి సందేహం ఉండవచ్చని, ఇది ఎవరికి నష్టం చేసేది కాదని, అందరికీ లాభం చేకూరుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రాహుల్ గాంధీ పాదయాత్రలో బీసీ కులగణన చేస్తామని మాట ఇచ్చిన ప్రకారం, ఆయన సూచన మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి, బహుజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు మారంపల్లి లక్ష్మీనారాయణ, నాయకులు కాడే శంకర్, సముద్రాల అజయ్, గాలి అనిల్ కుమార్, జీడీ రమేష్, పోతారపు సురేందర్, హస్తపురం తిరుమల, స్వరూప, గజ్జె లక్ష్మణ్, రమేష్ గౌడ్, పాల్గొన్నారు.