20-04-2025 12:37:26 AM
హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): ప్రొఫెషనల్ కోర్సుల సీట్ల భర్తీలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణను అమలు చేయనున్నారు. 2025-26 విద్యాసంవత్సరం నుంచే వర్గీకరణ అమలు కానుంది. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, లా వంటి కోర్సుల్లో వర్గీకరణను అనుసరించే సీట్లను ఈసారి భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు.
ఎస్సీ ఉపకులాల వర్గీకరణ జీవో ను ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎప్‌సెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. పరీక్షలు కూడా త్వరలోనే జరగనున్నా యి. ఈ పరిస్థితుల్లో ఉపకులాల వర్గీకరణ అమలవుతుందా? లేదా? అన్న ఆందోళన ఆయా వర్గాల విద్యార్థుల్లో ఉండేది. అయితే ఈ ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్‌లో వర్గీకరణను అమలు చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి బాలకిష్టారెడ్డి స్పష్టం చేశారు.
దీంతో ఎస్సీ ఉపకులాల వారికి రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించనున్నారు. ప్రస్తుతం ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్ ఇచ్చారు. అడ్మిషన్లకు మళ్లీ వేరే నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. అప్పుడు ఉపకులాల వర్గీకరణను అందులో పొందుపరుస్తారు. ఈసారి మొత్తంగా ప్రొఫెషనల్ కోర్సుల సీట్ల భర్తీలో మూడు మార్పులుండనున్నాయి. ఈ మూడు మార్పుల మేరకు కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నట్టు అధికారికవర్గాలు తెలిపాయి.
అత్యధిక సీట్లు గ్రూప్-2 కేటగిరీకే..
ఎస్సీ ఉపకులాల వర్గీకరణలో గ్రూప్-1లోని ఉప కులాలకు ఒక శాతం, గ్రూప్-2లోని వారికి 9 శాతం, గ్రూప్-3లోని ఉప కులాలకు 5 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ ఉపకులాల వర్గీకరణతో గ్రూప్ -2లోని కులాకే ఎక్కువ సీట్లు దక్కనున్నాయి. ఎస్సీ వర్గీకరణలో వీరికి 9 శాతం రిజర్వేషన్ ఉండటంతో ఆ మేరకు సీట్లను వారికి కేటాయించనున్నారు. ఇంజినీరింగ్‌లో మొత్తంగా 87,184 కన్వీనర్ కోటా సీట్లున్నాయి. వీటిలో 15 శాతం సీట్లు ఎస్సీలతో భర్తీచేస్తున్నారు.
వర్గీకరణలో ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించ డంతో గ్రూప్ -2కు 7,839 సీట్లు దక్కుతాయి. ఫార్మసీలో 963, ఎంబీఏ, ఎంసీఏలో 3,204 సీట్ల చొప్పున గ్రూపు--2కి దక్కుతాయి. ప్రస్తుతం ప్రవేశ పరీక్షలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరుగుతోంది. ఈ నెలాఖరు నుంచి ప్రవేశ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇవి పూర్తయిన తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత కౌన్సెలింగ్ కోసం మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ కొనసాగుతుంది. ఈ కౌన్సెలింగ్‌లో ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు అనుగు ణంగా సీట్లను కేటాయిస్తారు.
దివ్యాంగులకు సీట్ల కేటాయింపు
-ఈసారి నూతన విద్యాసంవత్సరం నుంచి ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగులకు 5 శాతం సీట్లను కేటాయిస్తారు. ఐదు కేటగిరీలుగా విభజించి ఐదుశాతం రిజర్వేషన్లను వర్తింపజేస్తారు. దృష్టిలోపం- ఏ కేటగిరి, వినికిడిలోపం, మూగ- కేటగిరి, అంగవైకల్యం--సీ కేటగిరి, మానసిక వైకల్యం -డీ, ఒకటికి మించి వైకల్యాలుంటే ఈ కేటగిరి కింద ఒకశాతం సీట్లను కేటాయిస్తారు.
అంతేగాక రాష్ర్ట విభజన చట్టం ప్రకారం పదేండ్ల పాటు విద్యాసంస్థల్లో ప్రవేశాల కోటా గడువు ముగిసింది. గతంలో 85 శాతం తెలంగాణకు, 15శాతం ఏపీ కోటా సీట్లుండగా, ఈ 2025-26 నూతన విద్యాసంవత్సరం నుంచి మొత్తం సీట్లను తెలంగాణ వారితోనే భర్తీ చేస్తారు. 95శాతం సీట్లను తెలంగాణ వారికి కేటాయించగా, 5 శాతం సీట్లను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి 10 ఏండ్ల పాటు నివాసమున్న వారి పిల్లలు, స్థానికులైన వారి భార్యలు, భర్తలకు కేటాయించారు.