ఇన్‌ఫ్రా బాండ్ల జారీ
ముంబై, జూలై 10: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అఫర్డ్‌బుల్ హౌసింగ్ బాండ్లను జారీచేయడం ద్వారా రూ. 10,000 కోట్లు సమీకరించినట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బుధవారం తెలిపింది. పక్షం రోజుల క్రితం కూడా ఇదేరీతిలో ఇన్‌ఫ్రా బాండ్లు జారీచేసి ఎస్బీఐ రూ. 10,000 కోట్లు సేకరించింది. తాజా బాండ్లను 7.36 శాతం వార్షిక కూపన్ రేటుతో15 ఏండ్ల కాలపరిమితికి జారీచేశామని బ్యాంక్ తెలిపింది. వాస్తవానికి ఇష్యూ పరిమాణం రూ. 5,000 కోట్లు కాగా, అదనంగా రూ.5,000 కోట్లను అట్టిపెట్టుకునే గ్రీన్‌షూ ఆప్షన్‌తో బాండ్లను జారీచేసింది. ఇన్వెస్టర్ల ఆసక్తి ఫలితంగా ఇష్యూ 3.6 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయ్యిందని, రూ. 18,145 కోట్ల విలువైన బిడ్స్ అందాయని ఎస్బీఐ వివరించింది. ప్రావిడెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, కార్పొరేట్లు బిడ్ చేసినట్టు తెలిపింది. తాజా ఇష్యూతో ఇప్పటివర కూ దీర్ఘకాలిక బాండ్ల ఇష్యూల ద్వారా బ్యాం క్ రూ.59,718 కోట్లు సమీకరించింది.