* ఎస్బీఐ ప్రధాన జనరల్ మేనేజర్ రాజేశ్‌కుమార్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 26 (విజయక్రాంతి): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక వృద్ధికి మాత్రమే కాకుండా సామాజిక పురోగతి కోసం నిరంతరం కృషి చేస్తుందని ఎస్బీఐ ప్రధాన జనరల్ మేనేజర్ రాజేశ్‌కుమార్ అన్నారు. దేశాన్ని బలమైన శక్తిగా, సమానత్వంతో కూడిన అభివృద్ధి చెందుతున్న భారత్‌ను నిర్మించడానికి ఎస్బీ పాత్ర ఎంతో కీలకమైందన్నారు.
ఆదివారం ఎస్బీ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజేశ్‌కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఎస్బీఐ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచంలో అత్యంత నమ్మకమైన బ్యాంకు ల జాబితాలో ఎస్బీఐ 4వ స్థానంలో నిలిచిందని, 2024 ఏడాదికి గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ అందించిన “భారతదేశ ఉత్తమ బ్యాంక్” పురస్కారాన్ని పొందినట్టు తెలిపారు.
డిజిటల్ ఆవిష్కరణల ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన, భద్రమైన బ్యాంకింగ్ సేవలను అందించడానికి ఎస్బీఐ కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ సీజీఎం రామకృష్ణ, జీఎంలు, ఎస్‌ఈలు, సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.