న్యూఢిల్లీ, జూలై 4: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవసాయ రుణాల రిస్క్‌లను తగ్గించేదిశగా గురువారం కొత్తగా 35 అగ్రికల్చర్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెల్స్‌ను ప్రారంభించింది. వీటితో సహా ఎస్బీఐ 69వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 11 నూతన ఆవిష్కరణలను ప్రకటించింది. భీమ్ ఎస్బీఐ పే యాప్‌లో ట్యాప్ అండ్ పే ఫీచర్‌ను, యూనో యాప్‌లో మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై డిజిటల్ రుణ సదుపాయాల్ని కల్పించినట్టు ఎస్బీఐ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.
అలాగే కేంద్ర ప్రభుత్వపు పీఎం సూర్యా ఘర్ స్కీమ్ కింద సోలార్ రూఫ్‌టాప్‌లు ఏర్పాటు చేసుకునేందుకు రుణ వితరణను పూర్తిగా డిజిటలైజ్ చేసినట్టు తెలిపింది. ఎస్బీఐ సూర్యా ఘర్ లోన్ కింద 10 కిలోవాట్ల సామర్థ్యం వరకూ రుణాలు ఆఫర్ చేస్తున్నామన్నది. దరఖాస్తు రిజిస్ట్రేషన్ నుంచి రుణ పంపిణీ వరకూ ఎస్బీఐ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై జరుగుతుందన్నది. గృహ రుణాల ప్రాసెసింగ్ మరింత పారదర్శకంగా ఉండేందుకు వివిధ ప్రాసెసింగ్ దశల్లో రుణ దరఖాస్తు స్టాటస్‌ను ఇకనుంచి ఈమెయిల్, ఎస్‌ఎంఎస్ నోటిఫికేషన్ ద్వారా గృహ రుణ గ్రహీతలు పొందుతారని తెలిపింది.