calender_icon.png 16 November, 2024 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్బీఐ రుణ రేట్లు పెంపు

16-11-2024 03:04:34 AM

ఒక ఏడాది ఎంసీఎల్‌ఆర్ 0.05 శాతం పెరుగుదల

ముంబై, నవంబర్ 15: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణ రేట్లను స్వల్పంగా పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్‌బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్‌ఆర్) ఆధారంగా ఇచ్చే కొన్ని కాలపరిమితులతో కూడిన రుణాలపై వడ్డీ రేటును 0.05 శాతం (5 బేసిస్ పాయింట్లు) పెంచింది. ఎస్బీఐ వెబ్‌సైట్‌లో ఉంచిన నోటీసు ప్రకారం గృహ రుణాలు వంటి దీర్ఘకాలిక రుణాలకు లింక్ చేసే ఒక ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ను 0.05 శాతం పెంచి 9 శాతానికి చేర్చింది. పెరిగిన రేట్లు నవంబర్ 15 నుంచి అమలులోకి వస్తాయి.

మూడు, ఆరు నెలల కాలపరిమితుల ఎంసీఎల్‌ఆర్‌ను సైతం పెంచింది. అయితే ఓవర్‌నైట్, ఒక నెల, రెండేండ్లు, మూడేండ్ల కాలపరిమితుల ఎంసీఎల్‌ఆర్‌ను యథాతథంగా అట్టిపెట్టింది. డిపాజిట్ల వ్యయం పెరుగుతున్న కారణంగా ఎస్బీఐ గత కొద్దికాలంలో ఎస్బీఐ రెండు దఫాలు ఎంసీఎల్‌ఆర్‌ను పెంచింది. తమ లోన్‌బుక్‌లో 42 శాతం రుణాలు ఎంసీఎల్‌ఆర్‌కు లింక్ చేసినవని, మిగిలిన రుణాలు ఎక్స్‌ట్రనల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్‌ఆర్) ఆధారంగా ఇచ్చినవని ఇటీవల ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి వెల్లడించారు.