calender_icon.png 27 December, 2024 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్బీఐ ‘అమృత్ వృష్టి’

17-07-2024 07:02:29 AM

  • 7.25శాతం వడ్డీతో స్పెషల్ ఎఫ్‌డీ 
  • సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ

న్యూఢిల్లీ, జూలై 16: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా ‘అమృత్ వృష్టి’ పేరిట ఒక అధిక వడ్డీ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. జూలై 15 నుంచి అమలులోకి వచ్చిన ఈ ఎఫ్‌డీపై 75 బేసిస్ పాయింట్ల అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నది. 444 రోజుల కాలపరిమితితో జారీచేస్తున్న ఈ ప్రత్యేక డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 7.25 శాతం వార్షిక వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ రేటును బ్యాంక్ నిర్ణయించింది.

బ్యాంక్ శాఖలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూనో చానళ్ల ద్వారా ఈ ప్రత్యేక ఎఫ్‌డీని తీసుకోవచ్చని ఎస్బీఐ మంగళవారం తెలిపింది. ఈ స్కీమ్ 2024 జూలై 15 నుంచి 2025 మార్చి 31వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ డిపాజిట్లపై రుణ సదుపాయం కూడా పొందవచ్చని తెలిపింది. ఎస్బీఐ గతంలో ఇదేవిధమైన ప్రత్యేక డిపాజిట్ పథకం ‘అమృత్ కలశ్’ను 7.10 శాతం వడ్డీతో (సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం) తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

బీవోబీ మాన్‌సూన్ ధమాకా

బ్యాంక్ ఆఫ్ బరోడా  (బీవోబీ) మాన్‌సూన్ ధమాకా డిపాజిట్ పేరుతో ప్రత్యేక టెర్మ్ డిపాజిట్ స్కీమ్‌ను ఆవిష్కరించింది. రెండు కాలపరిమితుల్లో ఈ ఎఫ్‌డీ లభిస్తుంది. 399 రోజుల స్కీమ్‌కు 7.25 శాతం వార్షిక వడ్డీని, 333 రోజుల స్కీమ్‌కు 7.15 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తున్నది. సీనియర్ సిటిజన్లకు అరశాతం అధికంగా 7.75 శాతం, 7.65 శాతం చొప్పున వడ్డీ రేట్లను నిర్ణయించింది. జూలై 15 నుంచి అమల్లోకి వచ్చిన ఈ స్కీమ్‌లు రూ.3 కోట్లలోపు రిటైల్ డిపాజిట్లకు వర్తిస్తాయని బ్యాంక్ తెలిపింది.