రూ.2.91లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 12 (విజయక్రాంతి): క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతానని నమ్మించి ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ.2.91లక్షల నగదును సైబర్ నేరగాళ్లు దోచేశారు. సైబర్ క్రైమ్ డీసీపీ తెలిపిన వివరాలు.. క్రెడిట్ కార్డు లిమిట్‌ను పెంచుతామని నగరానికి చెందిన ఓ వ్యక్తికి వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది.అందులో సూచించిన అప్లికేషన్‌ను ఓపెన్ చేయగానే బాధితుడు ఎటువంటి ఓటీపీని పంపించకున్నా అతని ఖాతాలోని రూ.2.91లక్షలను సైబర్ నేరగాళ్లు దోచేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.
ఎన్‌సీఆర్‌పీ సైబర్‌క్రైమ్ బృందం పోలీసులు బాధితుడి ఫోన్‌కు వచ్చిన సందేశాల ద్వారానే అతని ఖాతా నుంచి డబ్బు లు డెబిట్ అయినట్లు గుర్తించారు. అప్రమత్తమైన పోలీసులు సైబర్ నేరగాళ్ల ఖాతాను ఫ్రీజ్ చేసి బాధితుడికి రూ. 2.91లక్షలను రీఫండ్ చేశారు. వాట్సాప్‌లో వచ్చే మెసేజ్‌లు, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. పాస్‌వర్డ్, పిన్‌నంబర్లను ఎట్టిపరిస్థితుల్లో ఎవరికీ చెప్పొద్దంటున్నారు. అనుమానం వస్తే సైబర్‌క్రైమ్ నంబర్ 1930కి ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.