* ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి
* లేకుంటే ఉద్యమిస్తాం
* సీఎంకు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ
హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. బకాయిలను చెల్లించకపోవడాన్ని తప్పుపట్టిన బండి సంజయ్.. సీఎం రేవంత్‌రెడ్డికి గురువారం బహిరంగ లేఖ రాశారు. విద్య, వైద్యం విషయంలో కాంగ్రెస్ తీరు కోట్లాది మంది ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని తెలిపారు.
‘ఆరోగ్యశ్రీ’, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ‘నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్టుందని పేర్కొన్నారు. ఒకవైపు ‘ఆరోగ్యశ్రీ’ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతున్నట్టు, ఆరోగ్య సేవలను విస్తరిస్తున్నట్టు ప్రకటించారని, కానీ అసలు బిల్లులే చెల్లించకుండా, ఆరోగ్యశ్రీ సేవలే ప్రజలకు అందకుండా చేస్తుండటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
మీ ఏడాది పాలన నిర్వాకంవల్ల రూ.వెయ్యి కోట్లకుపైగా ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయాయన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కూడా ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తున్నారని తెలిపారు. గత బీఆర్‌ఎస్ తోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంవల్ల రూ.7వేల కోట్లకుపైగా బకాయిలు పేరుకుపోయాయని, కాలేజీలు మూతపడే దుస్థితికి వచ్చాయని వెల్లడించారు.
2.75 లక్షల కోట్ల రాష్ర్ట బడ్జెట్ నుంచి రూ.8 వేల కోట్లు చెల్లించి లక్షల మంది రోగులను, విద్యార్థులను ఆదుకోలేరా? అని ప్రశ్నించారు. విదేశీ, ఢిల్లీ పర్యటనలు, మూసీ పునరుజ్జీవం, ఫోర్త్ సిటీ పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్న మీకు రూ.8 వేల కోట్లు చెల్లించేందుకు మనసు రావడం లేదా? అని నిలదీశారు. తక్షణమే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలని, లేనిపక్షంలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నాయకత్వంలో విద్యార్థుల, పేదలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.