25-03-2025 04:53:12 PM
సంగారెడ్డి (విజయక్రాంతి): వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) మహిళా వికలాంగుల రాష్ట్ర సదస్సు మార్చి 22, 23 తేదీల్లో హైదరాబాద్ లో జరిగింది. 15 జిల్లాల నుండి 100 మంది మహిళా వికలాంగులు హాజరు అయ్యారు. ఈ సదస్సులో రాష్ట్రంలో మహిళా వికలాంగుల సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరిగింది. మహిళా వికలాంగుల సమస్యలపై దశలవారీగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు నిర్వహించాలని, మహిళా వికలాంగులపై వేధింపులు, అత్యాచారాలు అరికట్టాలని తీర్మానం చేశారు.
సకలాంగులు మహిళలతో సమానంగా మహిళా వికలాంగులకు అవకాశాలు కల్పించాలని, ఇందిరా మహిళా శక్తి పథకంలో 5 శాతం కేటాయించాలని సదస్సు తీర్మానం చేసింది. ఈ సదస్సులో NPRD మహిళా విభాగం రాష్ట్ర కమిటీ 27 మందితో ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యింది. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం కాన్సానపల్లి గ్రామానికి చెందిన సి. సాయమ్మ రాష్ట్ర కన్వీనర్ గా, పఠాన్ చెరువు కు చెందిన జయలక్ష్మి రాష్ట్ర కో కన్వీనర్ గా, మేరీ రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా ఎన్నిక అయ్యారు.