జమిలి ఎన్నికలతో ‘ఒకే దేశం -ఒకే ఎన్నిక’ విధానం తేవడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ వేసింది. ఆ కమిటీ నివేదిక కేంద్రానికి సమర్పించగా, దాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఆ తదనంతరం పార్లమెంటులో ఆమోదించుకొని అమలు చేయ పూనుకున్నారు. ఈ జమిలి ఎన్నికలు మన దేశానికి నష్టదాయకం. లౌకిక విలువలు, రాజ్యాంగ మూలాలకు విఘాతం కలిగిస్తుంది. ఈ పద్ధతి రాజ్యాంగ బద్ధమే కాదని తీవ్ర స్థాయిలో విమర్శలూ వ స్తున్నాయి. అమలులో అసాధ్యమని, రాజకీయ సంక్లిష్ట సంక్షోభాలకు దారితీస్తుందని పలువురు మేధావులు, విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మన దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, స్థాని క సంస్థలలో భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వాల ఏర్పాటుకు అనేక సమీకరణలు ఉంటాయి. ఏదైనా రాష్ట్రం లో రెండున్నర ఏళ్లకే ప్రభుత్వం కూలిపోతే మిగిలిన రెండున్నరేళ్ళు అక్కడ ఎన్నికలు నిర్వహించకుండా కేంద్రం పెత్తనం చేస్తుందా? అనే ప్రశ్న ఈ జమిలి ఎన్నికల పోకడతో ఉత్పన్నమవుతున్నది. అలాగే, రాజ్యాంగ లౌకిక విలువలకు, మూలాలకు ఈ విధానంతో పెద్ద విఘాతం కలుగనున్నట్టు కూడా విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు ఏం చేయాలో రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉంది. దాన్ని యథాతథంగా అమలు చేస్తే చాలు.
- మేకిరి దామోదర్, వరంగల్ జిల్లా