calender_icon.png 24 February, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సావరియా జీ.. సతుల గొడవండీ..

19-02-2025 12:00:00 AM

అర్జున్ కపూర్, రకుల్‌ప్రీత్ సింగ్, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కామెడీ డ్రామా ‘మేరే హస్బెండ్ కీ బీవీ’. స్టాండ్-అప్ కమెడియన్ హర్ష్ గుజ్రాల్, ఆదిత్య సీల్, శక్తి కపూర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ముదస్సర్ అజీజ్ దర్శకత్వంలో వాషు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్షిఖా దేశ్‌ముఖ్ నిర్మిస్తున్నారు.

అజీజ్ ఇంతకుముందు ‘పతి పత్నీ ఔర్ వో’, ‘ఖేల్ ఖేల్ మే’ వంటి చిత్రాలను తెరకెక్కించగా, తాజా చిత్రాన్ని ముక్కోణపు ప్రేమకథగా రూపొందిస్తున్నారు. ‘ట్రయాంగిల్ లవ్ నహీ.. సర్కిల్ హై..’ అంటూ విడుదల చేసిన ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో చిత్రబృందం మరింత ఉత్సాహంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి తాజాగా మంగళవారం ‘సావరియా జీ’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా నుంచి ఇంతకుముందు విడుదలైన ‘గోరీ హై కలైయన్’, ‘ఇక్ వారి’ తర్వాత ఈ పాట కూడా ఒక సరదా గీతంగా సాగుతోంది.

సినిమాలో రకుల్, భూమి మధ్య గొడవ నేపథ్యంలో వచ్చే ఈ పాటలో అర్జున్ కపూర్‌ను పొందడానికి ఇద్దరూ పోటాపోటీగా పరస్పరం తగువులాడుకునే సతుల గొడవకు సంబంధించిన సన్నివేశాల్ని అందంగా చూపించారు.

ఈ పాటకు చిత్ర దర్శకుడు ముదస్సర్ అజీజ్ సాహిత్యం రాశారు. సంగీత దర్శకుడు సొహైల్ సేన్ తనదైన శైలిలో స్వరపరుస్తూ, ఆయనే వర్షా సింగ్ ధనోవాతో కలిసి ఆలపించారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానుంది.