17-02-2025 12:00:00 AM
నిన్నే ఇటు చూడు
తల వంచి కత్తిపీటతో
కూరగాయలు తరగటం తప్పా...
ఎదురుగా ఏం జరుగుతుందో
ఇసుమంతైనా పట్టదా....అన్నాడు
రెండు కవితా పంక్తులనుంచి
అమాంతం జారిపడ్డ అతడు
శ్రమైక భావాలనుంచి
ప్రేమ సన్నివేశాలేవో ఏరుతున్నాడు
బిక్క మొగమేసుకుని చూస్తున్నా ఆమె
దృశ్యంలోకి పరకాయ ప్రవేశం చేస్తూ
వెన్నెల ముద్దల్ని వంటగా చేస్తున్న
సిద్దం కమ్మంటూ...
రెండు కళ్ళనుంచి
కొన్ని కాంతిపూలను విసిరింది
ఒకవైపు ఉల్లిపాయల ఉక్రోషం
కన్నీరవుతుంటే...
మరోవైపు ఆనంద భాష్పాలను రాలుస్తూ
ఒళ్లంతా కళ్ళు చేసుకుని
కిటికీ రెక్కల్ని తెరిచాడు
ఊసుల సీతాకోక చిలుకలు
గుంపులు గుంపులుగా వచ్చి
పచ్చని రెండు మనసు మొక్కలపై
చెరగని సంతకాలేవో చేస్తున్నాయి
సరిగమల సవ్వడి ఏదో
శ్రమ కావ్యాన్ని ధ్వనిస్తోంది
పనులతో పల్లవించాలి గానీ..
ఎన్ని దూరాలు కురుసై పోతాయో
ఆమె రెప్పవాల్చి దీర్ఘశ్వాసలో వుంది
నిదుర లేచి నీళ్ళు చల్లాడతడు
చెదిరిన కలలు
జంటపక్షుల్లా ఎగిరిపోయాయి!
డా.కటుకోఝ్వల రమేష్
9949083327