calender_icon.png 12 January, 2025 | 5:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా వ్యాప్తంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

03-01-2025 07:34:19 PM

మహదేవపూర్ (విజయక్రాంతి): సావిత్రి బాయి పూలేను ఆదర్శంగా తీసుకొని ఉపాధ్యాయులు ఉన్నత విద్యను అందించాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సావిత్రి బాయి పూలే జయంతిని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఐడిఓసి కార్యాలయంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, సావిత్రి బాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ... మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా, మహిళల చదువు కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి సావిత్రి బాయి పూలే అని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి జన్మదినాన్ని మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. మహిళల జీవితాల్లో గొప్ప మార్పు తెచ్చారని, నేడు దాదాపు 50 శాతంపైగా మహిళలు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. 

మగవాళ్ళకంటే ఏమి తక్కువ కాదని నేడు అన్ని రంగాలలో ఎన్నో ఉన్నత స్థానాలలో మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలను రెండు కళ్లుగా భావించి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలు ప్రారంభం నాడే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫార్మ్స్ ఇచ్చామని తెలిపారు. నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం 1 నుండి 10 వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలను హాస్టళ్లుగా మార్చాలన్న ఆలోచన  చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రయివేటు కంటే మిన్నగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోదన అందించాలన్నదే ప్రభుత్వ ద్యేయమని అన్నారు. రానున్న రోజుల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరాలన్న లక్ష్యంతో ప్రభుత్వం యంగ్ ఇండియా మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.

అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ హాస్టళ్లుకు శాశ్వత భవనాలు నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. మట్టిలో మాణిక్యాలను కలెక్టర్లుగా, ఎస్పీలుగా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ఆనాడే మహిళా విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప వ్యక్తి సావిత్రి బాబు పూలే అని అన్నారు. మహిళల పట్ల వివక్షత ఉన్న రోజుల్లో విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించి మహిళల కొరకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసిన మహానుబావురాలని కొనియాడారు. సావిత్రి బాయి జయంతిని పురస్కరించుకుని ఆమె త్యాగానికి గుర్తింపుగా ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించినట్లు తెలిపారు. 

దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా అణగారిన వర్గాల మహిళలకు అక్షర జ్యోతి వెలిగించిన మహనీయురాలిని ఆశయాలతో ముందుకు వెళ్లాలని సూచించారు. మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషమని ఇది మహిళలకు లభించిన గౌరవమని, ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను శాలువా, మెమేంటోలతో ఘనంగా సత్కరించారు. మహాదేవపూర్ మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో మహదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రిలోని రోగులకు పాలు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, మహిళ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.