27-04-2025 12:00:00 AM
కాస్త రిస్క్ తీసుకుంటే..
పెట్టుబడి అంటేనే రిస్క్‌తో కూడుకున్నది. అయితే సంప్రదాయ పెట్టుబడి మార్గాల్లో పొదుపు చేస్తే రాబడికి హామీ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల పెట్టుబడి సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకునేది జీవిత బీమా సంస్థలు అందించే యూనిట్ ఆధారిత బీమా పాలసీలు గురించి. ఇవి ఇన్వెస్టర్‌కు దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడిని ఇస్తుంది. అందుకే ఈక్విటీ మార్కెట్ల నుంచి దూరంగా ఉండకూడదు. సంపదను పెంచుకోవాలంటే వీటిలో పెట్టుబడి ఎంతో అవసరం.
వయసులో ఉన్నప్పుడు కష్టపడి సంపాదించిన డబ్బును ఆస్వాదించేందుకు.. సరైన సమయం రిటైర్మెంట్ ఏజ్. అయితే ఆ సమయాన్ని ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఆస్వాదించాలంటే చిన్న వయసులోనే సరైన పదవి విరమణ ప్రణాళికను రూపొందించుకోవాలి. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి మంచి రిటైర్మెంట్ ప్లాన్‌ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
చిన్నవయసులో..
డబ్బును కేవలం ఆదా చేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. దాచిన సొమ్మును మంచి రిటర్న్స్ ఇచ్చే పెట్టుబడుల్లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే రిటైర్ అయ్యేలోపు లాభాలు అందుకుంటారు. ఇందుకోసం పెట్టుబడులు వృద్ధి చెందేందుకు సరైన సమయం ఇవ్వాలి. అంటే ఇక్కడ డబ్బుతో పాటు.. కాలాన్ని కూడా గుర్తించుకోవాలి. చిన్న వయసు నుంచే పొదుపు చేయడం ప్రారంభించాలి. అప్పుడే అసలుపై వడ్డీ.. దానిపై చక్రవడ్డీ ఇలా ఒక మంచి నిధి ఏర్పాటయ్యేందుకు అవకాశం ఉంటుంది.
సిద్ధంగా ఉండాలి..
జీవితంలో ఎదుర్కొనే కొన్ని ఖర్చులను ముందే ఊహించగలం. వాటిల్లో ప్రధానమైనవి పిల్లల చదువులు, వివాహాలు, ఇతర శుభకార్యాలు. వీటి విషయంలో ఓ స్పష్టత ఉంటుంది. అయితే కొన్ని ఊహించని, అనుకోకుండా వచ్చే ఖర్చులు మనల్ని తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. అవే కుటుంబ సభ్యుల్లోని ఎవరికైనా వచ్చే తీవ్ర అనారోగ్యం, ఆకస్మిక మరణాలు వంటివి. వీటికి ముందే సిద్ధంగా ఉండాలి.