calender_icon.png 30 October, 2024 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోనోపొలీ బచావో సిండికేట్‌

30-10-2024 03:14:55 AM

అదానీ, సెబీ చీఫ్‌పై కాంగ్రెస్ విమర్శలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: దేశంలో ‘మోనోపొలీ బచావో సిండికేట్ ’ కార్యక్రమం నడుస్తున్నదని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాని నరేంద్రమోదీ రక్షణలో అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడుతుంటే వాటిని సెబీ చైర్‌పర్సన్ మాధుబి బుచ్ కాపాడుతూ వస్తున్నారని విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్ వేదికగా ప్రధానిపై విమర్శలు గుప్పించగా, ఆ పార్టీ అగ్రనేత అదే అంశంపై మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు. ‘మోనోపొలీ బచావ్ సిండికేట్ కారణంగా ఇండియా వ్యవస్థీకృత ఫ్రేమ్‌వర్క్‌కు పట్టిన తెగులు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ సిండికేట్‌లో అదానీ, పలు నియంత్రణ సంస్థలు, బీజేపీ  మధ్య ప్రమాదకరమైన బంధం ఉన్నది. ఒకవైపు సైనికుల శిక్షణ, పెన్షన్లు, వారి సంక్షేమానికి ఉపయోగించాల్సిన కీలకమైన నిధులు అగ్నివీర్ వంటి పథకాలకు మళ్లిస్తుండగా, మరోవైపు విదేశీ ఆయుధాలకు పేర్లు మార్చి అదానీ కంపెనీ మన దేశంలో ఎలా లాభాలను పొందుతున్నదో అదానీ డిఫెన్స్ వెబ్‌సైట్ స్వయంగా వెల్లడించింది. ఈ నమ్మకద్రోహం దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టడమే కాకుండా, మన యువత భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకం చేస్తున్నదని’ అని రాహుల్‌గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. ‘మోదీ జీ.. మీరు నియమించిన సెబీ చైర్‌పర్సన్ ఆధ్వర్యంలో సృష్టించబడిన తెగులును మీరు ఎంతోకాలం రక్షించలేరు. ఎన్నో ఏండ్లపాటు ఎంతో కష్టనష్టాలకు ఓర్చి నిర్మాణమైన సెబీ విశ్వసనీయతను మీరు దారుణంగా దెబ్బతీశారు. కోట్లమంది చిన్న మదుపరుల సంపదను ప్రశ్నార్థకం చేశారు. మీ ప్రియమైన మిత్రుడు అదానీ ఏకస్వామ్యాన్ని సృష్టించేందుకు మీరు నిర్మించిన వ్యవస్థలోని ఆనుపానులన్నీ బహిర్గతం కావాలంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలి’ అని మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ మీడియా ఇన్‌చార్జి పవన్‌ఖేరా.. సెబీ చైర్‌పర్సన్ మాధుబి వివిధ కంపెనీలతో లాలూచీ పడ్డారని పలు ఆధారాలు బయటపెట్టారు.