calender_icon.png 26 October, 2024 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోతే ఒక్క ప్రాణం.. వస్తే తెలంగాణ!

23-05-2024 12:05:00 AM

స్వరాష్ట్ర కాంక్షతో కొందరు.. వలస దోపిడీని సహించక మరికొందరు. భవిష్యతు దొరుకుతుందని విద్యార్థి, నిరుద్యోగులు. ఇలా ఒక్కటేమిటి? వందల్లో మొదలైన ఆకాంక్ష.. మూడున్నర కోట్లకు చేరింది. అయితే వారందరి లక్ష్యాలు దరి చేరాయా? సబ్బండ వర్గాల సమస్యలు పరిష్కారమయ్యాయా? ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో వచ్చిన తెలంగాణ ఆగమైంది. నీళ్లూ, నిధులు, నియామకాలు కొందరికే దక్కాయన్న భావన నెలకొంది. ఉద్యమ ద్రోహులే  అందలం ఎక్కి ఉద్యమకారులను చిన్నచూపు చూస్తున్నారు. ఎందరో ఆత్మబలిదానాలతో ఏర్పడ్డది మన తెలంగాణ. ప్రాణం కన్నా విలువైనది ఈ భూమి మీద ఏం ఉంటుంది చెప్పండి? తెలంగాణ కోసం మా అమ్మ చనిపోయారు? ఇది మా ఇంట్లో ఎప్పటికీ తీరని వెలి తి. ఉమ్మడి రాష్ట్రంలో అన్నమో రామచంద్ర అంటూ పొట్ట చేతబట్టుకుని ఉన్న ఊరును విడిచిపెట్టి వలసలు వెళ్లి మా జీవనాన్ని కొనసాగిస్తున్నాం. నీళ్లు, నిధులు నియామకాలు జరగాలంటే ఒక్క తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యమనుకున్నాం. పోరాడిన ఉద్యమకారులు ఎందరో వారి ప్రాణాలను పణంగా పెట్టి ఆత్మబలిదానాలు చేశారు. అలాంటి వారిలో వనపర్తి జిల్లా పరిధిలోని ఘణపురం మండల కేంద్రంలోని సత్యమ్మ సైతం ఒకరు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అయ్యిందని కుమారుడు నాగరాజు అన్నారు. 

తెలంగాణ రావాలి అప్పుడే మరుగున పడ్డ బతుకులకు జీవం వస్తుంది. ‘పోతే నా ఒక్క ప్రాణం.. వస్తే తెలంగాణ’ అనుకున్నది మా అమ్మ. నాలాంటి ఎంతో మంది జీవితాల్లో వెలుగు వస్తుందని ఆరాట పడేది. చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా.. బీడు బారిన భూముల్లో సాగు నీరు పారాలన్నా.. ఇలా ఎన్నో రంగాల్లో ముందుకు అడుగులు వేయాలన్నా..  ఒక్కటే మార్గం అదే తెలంగాణ సిద్ధ్దించాలి. అలా ఉద్యమ కాలంలో నిత్యం తెలంగాణపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను చూసి చలించి తెలంగాణ వస్తదో.. రాదో అన్న సంశయంలో అమ్మ చనిపోయారు. సత్యమ్మ భర్త కృష్ణయ్య వీరికి కూతురు నాగలక్ష్మి, కుమారుడు నాగరాజు ఉన్నారు. వీరికున్న రెండెకరాల పొలంలో పంటలు పండిస్తూ జీవించేవారు. మిగితా సీజన్లలో కూలి పని చేసేటోళ్లు కూతురి వివాహం జరిపించాక తెలంగాణ ఉద్యమ సమయంలో సత్యమ్మ ఆత్మార్పణం చేసుకున్నది. తరువాత తెలంగాణ ప్రభుత్వం నాగరాజుకు వనపర్తి జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ శాఖలో ఉద్యోగంతో పాటు ఆర్థిక సహాయాన్ని అందించింది. 

ప్రభుత్వ నివేదిక ప్రకారం

తెలంగాణ ఉద్యమ సమయంలో 3,500 మంది జైలుకు వెళ్లారు. 2,890 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిని కనీసం ఉద్యమకారులుగా గుర్తించే పరిస్థితి లేదు. ఉద్యమ సమయంలో ఆత్మబలిదానాలు చేసుకున్న వారి సంఖ్య 1,230. ఇందులో 1,089 మంది అమరులు ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చనిపోయారో పూర్తి వివరాలతో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ హైదరాబాద్ వారు ఒక నివేదిక తయారు చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది 419 మందినే. అమరు ల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది.

- పీ రాము  వనపర్తి, విజయక్రాంతి