calender_icon.png 28 September, 2024 | 4:34 AM

తమ్ముడి కోసం పోరాడే సత్య

27-09-2024 12:19:24 AM

ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో నటించింది ఒక స్టార్ హీరోయిన్ అయితే..? తెరపై యాక్షన్, ఫైట్స్ చేస్తుంటే..? ఆ మజాయే వేరు కదూ! సినీ ప్రియులకు ఆ మజాను పంచడానికి అలియా భట్ సిద్ధమయ్యింది. తాను ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జిగ్రా’. ఈ సినిమాతో తనలోని కొత్త కోణాన్ని బయటపెట్టి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి వచ్చేస్తోంది అలియా. అక్క, తమ్ముడి మధ్య అనుబంధంపై తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ గురువారం విడుదలైంది. ఈ చిత్రంలో అలియా భట్.. సత్య అనే పాత్రలో నటించగా తన తమ్ముడు అంకుర్‌గా వేదాంగ్ రైనా నటించాడు.

తన తమ్ముడికి విదేశంలో డ్రగ్స్ కేసులో ఉరిశిక్ష పడితే, అతన్ని ఎలా కాపాడుకునేందుకు సోదరి ఎలాంటి సాహసోపేతమైన ప్రయత్నాలు చేసిందో ట్రైలర్‌లో చూపించారు. ‘నేను మామూలు మనిషిని అని నేనెప్పుడూ చెప్పలేదు. నేను కేవలం అంకుర్ అక్కను మాత్రమే’ అని అలియా చెప్పే డైలాగ్‌తో ‘జిగ్రా’ ట్రైలర్ ముగుస్తుంది. వసన్ బాలా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అలియా భట్, షాహీన్ భట్, సోమెన్ మిశ్రా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.