కోర్టులో, బయట ఎంతో నేర్చుకున్నా
యుక్తవయసు నుంచే న్యాయవాదిగా పనిచేశా
పదవీ విరమణ సందర్భంగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ భావోద్వేగం
న్యూఢిల్లీ, నవంబర్ ౮: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం ముగిసింది. శుక్రవారం రోజు ఆయన చివరి పనిదినం పూర్తయింది. మే 11న జస్టిస్ సంజీవ్ ఖన్నా భారతదేశ సుప్రీం కోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు శుక్రవారం భోజన విరామం తర్వాత ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో చంద్రచూడ్ భావోద్వేగానికి గురయ్యారు. సమావేశంలో చంద్రచూ డ్ మాట్లాడుతూ.. ‘యువకుడిగా ఉన్నపుడు లాయర్‌గా సేవలందించడం మొదలుపెట్టా.
కోర్టు రూములో, బయట ఎన్నో కొత్తగా నేర్చుకున్నా. ఎంతో మంది గొప్ప న్యాయమూర్తులు ఇక్కడ సేవలందించి పదవీ విరమణ చేశారు. ఇప్పుడు నేను పదవీ విరమణ చేసినా పెద్దగా ప్రభావం పడదు. ఎందుకంటే నా తదుపరి సంజీవ్‌ఖన్నా ఉన్నారు. ఆయన ఎంతో పరిణతి చెందినవారు. సంజీవ్ నేతృత్వంలో తీర్పు లు విజయవంతంగా అమలవుతాయి. ఎవరైనా కానీ నువ్వు ప్రధాన న్యాయమూర్తిగా ఏం సాధించావు? ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్తున్నావు అని అడిగితే.. జడ్జిగా సంతృప్తిని సాధించాను అని చెప్తాను. సీజేఐగా ఉన్న ఈ కాలంలో దాదాపు 45 కేసులను డీల్ చేశాను’ అని పేర్కొన్నారు.
అందుకు మన్నించండి ప్లీజ్..
ప్రధాన న్యాయమూర్తిగా పదవిలో ఉన్న రోజుల్లో తాను ఎవరినైనా అనుకోకుండా బాధపెట్టి ఉంటే మన్నించమని సహచర లాయర్లను చంద్రచూడ్ అభ్యర్థించారు. మీ మనసులను బాధ పెట్టాలనే ఉద్దేశం తనకు లేదని అన్నారు. కావాలని బాధపెట్టకపోయినా క్షమాపణ అడుగుతున్నట్లు తెలిపారు. తాను తీర్పునిచ్చిన 45 కేసుల ద్వారా ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నానని తెలిపారు. బార్ బెంచ్ సీనియర్ సభ్యులతో పాటు అనేక మంది ఆయనకు వీడ్కోలు పలికారు.
ఈ సమావేశానికి కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా హాజరయ్యారు. వారు చంద్రచూడ్‌ను గొప్ప న్యాయమూర్తిగా మాత్రమే కాకుండా మానవత్వం ఉన్న మనిషిగా కూడా అభినందించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చంద్రచూడ్‌ను అభినందిస్తూ.. “కుటుంబ కర్త” అని అభివర్ణించారు. ఆయన పదవీకాలంలో ఎన్నో గొప్ప నిర్ణయాలు వెలువడ్డాయని కొనియాడారు. ఇక మీదట్నుంచి అతడి సేవలను కోల్పోతామని అన్నారు.
చంద్రచూడ్ గొప్పతనం అదే..
చంద్రచూడ్ గురించి పొగుడుతూ.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మరింత ఎమోషనల్ అయ్యారు. ‘మీరు అద్భుతమైన తండ్రికి అత్యద్భుతమైన కొడుకు మాత్రమే కాదు. ఎల్లప్పుడూ చిరునవ్వుతో వెలిగిపోయే చంద్రచూడ్” అని అన్నారు.
కన్నీరు పెట్టిన సీజేఐ
సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ కంటతడి పెట్టారు. సహచర న్యాయవాదులు అయిన జస్టిస్ హృషికేష రాయ్, జస్టిస్ నరసింహ దగ్గరి వెళ్లి.. వారితో పని చేసిన మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. ‘తన ముందు లాయర్‌గా వాదించే అవకాశంతో పాటు న్యాయవాదిగా కూడా కూర్చునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు జస్టిస్ నరసింహ తెలిపారు. చంద్రచూడ్ నవంబర్ 8 2022న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.