- ఏఐసీసీ నేతలు సమాధానం చెప్పాలి
- ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం
హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి) : ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తి చెందడం హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. రాష్ర్టంలో అసలు పాలనే లేదని, ఇంతకంటే దిక్కుమాలిన ప్రకటన మరొకటి లేదని ఎద్దేవా చేశారు.
ఆదివారం కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. బహుశా తెలంగాణ రైతులకు సంకెళ్లు వేసినందుకు ఏఐసీసీ సంతృప్తి చెందినట్టు కనిపిస్తుందన్నారు. అమాయకులైన అన్నదాతలను జైలులో పెట్టినందుకా? కొడంగల్‌లో బలవంతంగా భూములు గుంజుకున్నందుకా? ఏఐసీసీ ఎందుకు సంతృప్తిగా ఉందో చెప్పాలన్నారు.
రాష్ట్రాన్ని ఆగం చేసినందుకా అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అంతటి సంతృప్తిగా ఉందని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి అందుతున్న రూ.వేలకోట్ల మూటలు చూసి కాంగ్రెస్ నాయకులు మురిసిపోయినా, మాటిచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రిని, గ్యారంటీ కార్డు ఇచ్చి గారడీ చేసిన కాంగ్రెస్‌ను చూసి తెలంగాణ సమాజం రగిలిపోతోందన్నారు.
కాంగ్రెస్ తరతరాల దరిద్రం..
తెలంగాణకు కాంగ్రెస్ తరతరాల దరిద్రమని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో భూసేకరణ ఆపకుండా రాహుల్‌గాంధీ భూసేకరణ వ్యతిరేక స్వరం ఎంత వినిపిస్తే ఏం లాభమని కేటీఆర్ ఎక్స్ వేదికగా నిలదీశారు. దేశవ్యాప్తంగా భూసేకరణపై రణ గర్జన చేయాలని సూచించారు. తెలంగాణలో భూసేకరణను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? కొడంగల్ రైతుల కన్నీటికి కాంగ్రెస్ ఎందుకు కారణభూతమైందో చెప్పాలన్నారు. అదానీ, -అంబానీలపై జంగ్ అంటూ రామన్నపేటలో అదానీ ఫ్యాక్టరీకి ద్వారాలు ఎందుకు తెరిచారని ప్రశ్నించారు. అదానీ, - అంబానీలపై పోరాటం ఓ బూటకమన్నారు.
టైకాన్ కేరళ సమ్మిట్‌కు ఆహ్వానం
కేటీఆర్‌ను టైకాన్ కేరళ-2024 సమ్మిట్ నుంచి ఆహ్వానం అందింది. కేరళ అధ్యక్షుడు జాకబ్ జోయ్, టైకాన్ కేరళ 2024 చైర్మన్ వివేక్ కృష్ణ గోవింద్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ.. డిసెంబర్ 4, 5 తేదీల్లో కొచ్చీలోని గ్రాండ్ హయత్ వేదికగా 13వ ది ఇండస్ ఎంటర్ ప్రెన్యూర్స్ కాన్ఫరెన్స్ సమ్మిట్ జరగునుందన్నారు. టైకాన్ అవార్డులు, ముగింపు వేడుకలకు కేటీఆర్‌ను్ర ప్రత్యేకంగా ఆహ్వానించామని.. ఆయన పాల్గొనడం వల్ల సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకోవడంతోపాటు యువతకు ప్రేరణ కలుగుతుందని తుందని వారు పేర్కొన్నారు.
సీఎంకు కవచంగా కమల దళం
- రేవంత్‌ను కాపాడేందుకే డైవర్షన్ డ్రామాలు
- కిషన్‌రెడ్డిపై ఎక్స్ వేదికగా కేటీఆర్ ఫైర్
హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి) : సీఎం రేవంత్‌రెడ్డికి కమలదళం రక్షణ కవచంగా ఉందని, దోస్తును కాపాడేందుకు పార్టీ నేతలు చీకటి రాజకీయం చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. కిషన్‌రెడ్డికి మూసీ బాధితుల ఆక్రందనలు ఇప్పుడు గుర్తొచ్చాయా? అని ప్రశ్నించారు.
లగచర్ల ఘటనను పక్కదారి పట్టించేందుకు మూసీ నిద్ర చేపట్టారని విమర్శించారు. హైడ్రాను మొదట స్వాగతించి, తర్వాత బుల్డోజర్‌లను అడ్డుకుంటామన్నారని ఎద్దేవా చేశారు. మూసీ బాధితులకు భరోసానిచ్చింది తమ పార్టీనేనని స్పష్టం చేశారు.
బీజేపీ నాయకులకు అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడం వెనక ఉన్న మతలబు ఏమిటని? ఎవరిని కాపాడటం కోసం వంచనకు పాల్పడుతు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ను కాపాడేందుకే ఈ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారన్నారు. లగచర్ల రైతులకు తెలంగాణ బీజేపీ పంగానామాలు పెట్టిందని విమర్శించారు.