calender_icon.png 4 October, 2024 | 5:03 PM

శతయజ్ఞ ఫలప్రదం నవరాత్ర మహావ్రతం

04-10-2024 12:00:00 AM

నేడు రెండవ రోజు శ్రీరాజరాజేశ్వరీదేవి ఆరాధన :

మనిషి తాను కోరుకున్న ఏ స్థానాన్నయినా అందుకునే ఒక గొప్ప ఆధ్యాత్మిక మార్గం శరత్కాలంలో చేసే దేవీపూజ. అందుకే, చైత్ర ఆషాఢ ఆశ్వయుజ మాఘ మాసాల్లో చేసే నవరాత్రులలో ‘యాచాశ్వయుజమాసేస్యాత్ శతయజ్ఞ ఫలప్రదం’ అని ఈ ఆశ్వయుజ మాసంలో చేసే నవరాత్రులు నూరు యజ్ఞాలతో సమానమని ‘దేవీ పురాణం’ ఉద్ఘాటించింది. దేవీ ఆరాధన వల్ల మనిషి భౌతిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను ఎన్నింటినో పొందుతాడు. తద్వారా అనేక అద్భుతాలను మనం కళ్లారా చూస్తూనే ఉన్నాం.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రులను చేయడం సంప్రదాయంగా వస్తున్నది. దశమి (దసరా) రోజున అపరాజితా అమ్మవారి ఆరాధనతో ఈ నవరాత్రులు ముగుస్తాయి.

తొమ్మిది రోజులు తప్పనిసరి కాదు

సాధారణంగా ‘నవరాత్రులు’ అనగానే ఇంకా ‘ఏ నవరాత్రులైనా తొమ్మిది రోజులు విధిగా చేయాలి’ అనే ఆనవాయితీ అయితే ఉంది. ‘ప్రస్తుత దేవీ నవరాత్రులు కూడా తప్పనిసరిగా తొమ్మిది రోజులు చేయవలసినవేనా?’ అన్న సందేహం చాలామందికి కలుగుతుంది. ‘నవరాత్రులు’ అంటే తొమ్మిది రోజులు అనే అర్థం వచ్చే మాట నిజమే.

కానీ, ఈ దేవీ నవరాత్రులకు మాత్రం అలాంటి కచ్చితమైన నిబంధన ఏమీ లేదు. ‘నవరాత్రం’ అనే పేరుతో చేసేది ఒక మహావ్రతమని ‘స్కాంద పురాణం’ పేర్కొంది. అందులో ‘నవరాత్రాభిదం కర్మ మహా వ్రతమిదం స్మృతం’ ఋషులు చెప్పారు. కాబట్టి, తొమ్మిది రోజులు చేస్తేనే నవరాత్రులు అనుకోకూడదు. 

మరి, ఈ నవరాత్ర మహావ్రతం ఎన్ని రోజులు చేయాలి? 1) తొమ్మిది రోజులు: పాడ్యమి నుంచి 2) ఏడు రోజులు: తృతీయ నుంచి 3) ఐదు రోజులు: పంచమి నుంచి 4) మూడు రోజులు: సప్తమి నుంచి, చివరకు 5) ఒక్క రోజు అయినా సరే. అది నవమి నాడు చేసేది. ఇలా ఏ ప్రకారం ఆచరించినా అది ‘నవరాత్ర మహావ్రతమే’ అవుతుంది. అయితే, అన్నీ విధిగా నవమితోనే ముగియాలి.

ఇదే విషయాన్ని ‘మార్కండేయ పురాణం’లో ‘అధవా నవరాత్రంచ పంచసప్త త్రికందివా పూజయేత్ చండికాం శక్త్యా నవంద్యం దివసం నయేత్’ పేర్కొన్నారు. కనుక, సాధ్యపడని వారు కనీసం దుర్గాష్టమి తెల్లవారి వచ్చే ‘మహర్నవమి’ నాడు తప్పనిసరిగా అమ్మను ఆరాధించాలి. అందుకే, ఒక తిథి పెరిగినా ఒక తిథి పడిపోయినా ఈవ్రతాన్ని ‘నవరాత్ర వ్రత’మనే శాస్త్రాలు చెబుతున్నాయి. 

ఎవరు ప్రధాన దేవత?

శైలపుత్రీ, బ్రహ్మచారిణీ, చంద్రఘంటా, కూష్మాండా, స్కందమాతా, కాత్యాయనీ, కాలరాత్రీ, మహాగౌరీ, సిద్ధిదాత్రీ అని తొమ్మిది దేవతలను చెప్పినప్పటికినీ  ‘నవదుర్గాః ప్రకీర్తితాః’ అన్నారు. అంటే, దుర్గాదేవియే ఈ అన్ని రూపాలలో ప్రస్తుత ‘నవరాత్ర వ్రతాని’కి ప్రధాన దేవతగా ఉంటుందని శాస్త్రాలు తెలిపాయి. ఈ దుర్గాదేవి అనుగ్రహం ఎంత గొప్పదో మనకు ‘బ్రహ్మ వైవర్త పురాణం’ చక్కగా చెప్పింది. ‘దుర్గా’ అనే శబ్దంలో రెండు పదాలు ఉన్నాయి. ‘దుర్గ + ఆ’ అనేవి. ‘దుర్గ’ అంటే అనేక విధాలైన కష్టాలు. ‘ఆ’ అంటే ‘వాటిని సంహరించునది లేదా తొలగించునది’ అని అర్థం. ఇదే విషయాన్ని ఈ శ్లోకమూ వివరించింది.

‘దుర్గో దైత్య మహావిఘ్నే భవబందే చకర్మణి 

శోకే దు:ఖే చ నరకే యమదండే చ జన్మని 

మహాభయేతి రోగే చాప్యాశబ్ద హంతృవాచకః 

ఏతాన్ హంత్యేవ యాదేవీ సాదుర్గా పరికీర్తితా’ 

దుర్గాదేవి సర్వ విఘ్నాలను, సంసారబంధాన్ని, దుఃఖాన్ని, పాప సంపాదిత నరకాన్ని, మహా భయాన్ని, రోగాలను నశింపజేసేది. దుర్గముడనే రాక్షసుడిని సంహరించింది అనికూడా అర్థం ఉంది. మహా దుర్గాదేవిని నవరాత్రులలో ఆరాధిస్తే పైన చెప్పినవన్నీ తొలగిపోతాయి. కాబట్టే, ఇది ‘శత యజ్ఞఫల సమానమైంది’గా శాస్త్రాలు చెప్పాయి.

పాడ్యమి నాడు వారివారి సంప్రదాయానుసారంగా ఒక మంటపాన్ని ఏర్పాటు చేసుకుని, దానిపై దుర్గాదేవి మూర్తిని లేదా యంత్రాన్ని పెట్టుకుని కలశ స్థాపన (ఇదికూడా వారి ఆచారంలో ఉంటేనే), అఖండ దీపారాధన చేసుకోవాలి. భక్తి శ్రద్ధలతో చతుష్షష్ట్యు పదార పూజ చేయాలి. రాత్రి విశేషంగా ప్రదోష పూజ, రాజోపచార పూజ, భజనలు మొదలైనవి విధిగా చేసుకోవాలి. కుమారీ సువాసినీ పూజలు యధాశక్తి తప్పనిసరిగా ఆచరించాలి.

చండీహోమం తప్పనిసరి

నవరాత్రులలో తప్పనిసరిగా చేయవలసిన మరో ముఖ్యమైన అనుష్ఠానం చండీహోమం. సర్వోపద్రవాలను తొలగించడానికి, దేశం సస్యశ్యామలంగా ఉండడానికి, ప్రజలందరూ ఎలాంటి బాధలు లేకుండా సుఖశాంతులతో జీవించడానికి ఈ చండీహవనం అద్భుత ఫలప్రదంగా ఋషులు పేర్కొన్నారు. నవచండీ, శతచండీ, సహస్రచండీ, అయుతచండి .. ఇలా మన శక్త్యానుసారం ఈ హోమం చేసుకోవచ్చు.

నవరాత్ర కర్మణి పూజా ఏవ ప్రధానం 

ఉపవాసాదికం స్తోత్రజపాదికం చ అంగం

అంది ‘ధర్మసింధువు’. “మన శక్తిని అనుసరించి మాత్రమే ఉపవాసం ఉండాలి. నవరాత్ర వ్రతంలో ఉపవాసం ప్రధానం కాదు. కేవలం భక్తి శ్రద్ధలతో చేసే పూజనే ప్రధానం” అన్నది అందరూ గమనించాలి.

ఈ ఆశ్వయుజ మాసంలో చేసే దేవీపూజ కేవలం ఆధ్యాత్మికమైన ప్రయోజనాలనే కాకుండా ఎన్నో భౌతిక లాభాలనూ కలుగజేస్తుంది. ‘వసంతశరదావేవ జననాశకరావుభౌ’ అని శరత్ ఋతువులో అనేక రకాలైన అనారోగ్యాలు సంభవిస్తాయి కాబట్టి, ఈ కాలంలో చేసే నవరాత్ర వ్రతం వల్ల అవన్నీ తొలగిపోతాయి. ‘మార్కండేయ పురాణం’లోని సప్తశతి ప్రకారం, “ఈ శరత్కాలంలో చేసే దేవీపూజ వల్ల మానవులు ఎల్లప్పుడు సన్మార్గంలో నడుస్తారు. ఉన్నతమైన స్థానాన్ని పొందగలుగుతారు.” ఇంతేకాదు-

‘శరత్కాలే మహాపూజా క్రియతే 

యాచవార్షికీ దదాతి విత్తం 

పుత్రాంశ్చ మతిం ధర్మే గతిం శుభాం.’ 

పుత్రపౌత్రులు, ధనధాన్యాలూ సమృద్ధిగా కలుగుతాయని ఋషులు తెలియజేశారు. 

 శాస్త్రుల వేంకటేశ్వరశర్మ 

శ్రీ బగలాముఖీ శక్తిపీఠం, శివంపేట 

సెల్: 9849909165