26-03-2025 09:04:39 AM
బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ కోసం రూ. 44.12 కోట్లు మంజూరు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఈ అకాడమిక్ ఇయర్ నుంచే అడ్మిషన్లు
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు శాతవాహన విశ్వవిద్యాలయం(Satavahana Engineering College) అనుబంధ ఇంజినీరింగ్ కళాశాల మంజూరైంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 18 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దపల్లిలో జరిగిన సభలో స్థానిక మంత్రి చేసిన విజ్ఞప్తి మేరకు శాతవాహన విశ్వవిద్యాలయానికి హుస్నాబాద్‌లో ఇంజినీరింగ్ కళాశాల, విశ్వవిద్యాలయానికి లా కళాశాల మంజూరు చేసింది. ఈ సందర్భంగా స్థానికులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు.
2025-26 విద్యా సంవత్సరం నుంచే హుస్నాబాద్‌లో ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభం కానుంది. ఈ కళాశాలలో బీటెక్ (సీఎస్ఈ) - ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, బీటెక్ (ఐటీ), బీటెక్ (ఈసీఈ) కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో కోర్సులో 60 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు. ఈ కళాశాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 44.12 కోట్లు మంజూరు చేసింది. హుస్నాబాద్‌కు శాతవాహన ఇంజినీరింగ్ కళాశాల మంజూరు కావడంతో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.