శాసన సభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డికి కౌంటర్
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి) : ‘మీ పుణ్యం వల్లే రాష్ట్రంలోని సర్పంచులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’ అని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బీఆర్‌ఎస్‌పై ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధికి అప్పులు తీసుకొచ్చి సర్పంచ్‌లు ఖర్చు చేశారని, వారికి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్లే కొందరు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి వచ్చిందని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు శ్రీధర్‌బాబు కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో బిల్లులన్నింటిని ఒక్కొక్కటికిగా తమ ప్రభుత్వం పరిష్కారం చేసుకుంటూ వస్తోందని చెప్పారు. ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో ప్రవేశపెట్టిన అంశాలన్ని కూడా అమలు చేస్తామని మంత్రి సమాధానమిచ్చారు.
అద్భుతంగా అబద్ధాలు: మంత్రి సీతక్క
బీఆర్‌ఎస్ సభ్యులు అబద్ధాలను అద్భుతంగా చెప్తుంటారని మంత్రి సీతక్క ఎద్దేవాచేశారు. బీఆర్‌ఎస్ సర్కార్ రెండు నెలల ఆసరా పింఛన్ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చాక పింఛన్లు సకాలంలో ఇవ్వడం లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సీతక్క బదులిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పింఛన్లు ఇవ్వడంలో ఒకటి, రెండు రోజులు ఆలస్యమైనా ప్రతి నెల చెల్లిస్తున్నట్టు తెలిపారు.