calender_icon.png 3 November, 2024 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిసెంబర్ చివర్లో సర్పంచ్ ఎన్నికలు

03-11-2024 12:00:00 AM

  1. సంక్రాంతి లోపు కొత్త పాలకవర్గాలు
  2. రాజకీయ జోక్యం లేకుండా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక 
  3. నాలుగేళ్లలో 20 లక్షల ఇండ్ల నిర్మాణమే  లక్ష్యం
  4. మంత్రి పొంగులేటి ప్రకటన
  5. ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక?

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): సర్పంచ్ ఎన్నికలు డిసెంబర్ నెల చివర్లో జరుగుతాయని, సంక్రాంతిలోపే గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు కొలువు దీరుతాయని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు.

సీఎం మార్పు అనేది టీ కప్పులో తుఫాన్ లాంటిదని, ప్రతిపక్షాలు వార్తల్లో ఉండాలని ఏదో ఒకటి మాట్లాడుతాయని కొట్టిపారేశారు. తమ ప్రభుత్వానికి ఇంకా 4 ఏళ్ల ఒక నెల సమయం ఉందని, అప్పటివరకూ రేవంత్‌రెడ్డినే సీఎంగా కొనసాగుతారని పునరుద్ఘాటించారు.

ఆ తర్వాత మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, అప్పుడు సీఎంగా ఎవరిని నియమించాలనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. శనివారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో పొంగులేటి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో రాజకీయ జోక్యం ఉండదని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక యాప్‌ను సిద్ధం చేసినట్టు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లలో నిరుపేదలకే తొలి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఈ నెల 5 లేదా 6 నుంచి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని, ఈ నెల 20 వరకు గ్రామ సభల్లో ఇందిరమ్మ కమిటీ లబ్ధిదారుల జాబితాను తయారు చేసి, తహసీల్దార్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు వెళ్లాక..

వెంటనే తుది జాబితాను ప్రకటించనున్నట్టు మంత్రి వివరించారు. లబ్ధిదారుల ఎంపిక స్మార్ట్‌కార్డుల ఆధారంగానే, 360 డిగ్రీల వేగంలో ఉంటుందని తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇండ్ల నిర్మాణం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, తల తాకట్టు పెట్టునా నిర్మించి తీరుతామని స్పష్టంచేశారు. మొదటి విడత ఇండ్లకు దాదాపు రూ.28 వేల కోట్ల వరకు ప్రభుత్వంపై భారం పడుతుందని పేర్కొన్నారు. మహిళల పేరు మీదనే ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపు ఉంటుందని చెప్పారు. 

నాలుగు దశల్లో నిధలు విడుదల 

లబ్ధిదారులు తమకు నచ్చిన విధంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని పొంగులేటి తెలిపారు. 400 చదరపు అడుగులకు తగ్గకుండా టాయిలెట్స్, కిచెన్ ఉండేలా డిజైన్ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.5 లక్షల వరకు ప్రభుత్వం సహాయం చేస్తుందని, గ్రీన్ చానెల్ ద్వారా చెల్లింపులు ఉంటాయని, బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయనున్నట్టు చెప్పారు.

బేస్మెంట్ వరకు రూ.లక్ష, లెంటల్ లెవల్‌కు రూ.1.25 లక్షలు, స్లాబ్ లెవల్‌కు రూ.1.75 లక్షలు, పూర్తయ్యాక మిగతా రూ. లక్ష చెల్లిస్తామని మంత్రి స్పష్టంచేశారు. మొదటి విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయించనున్నట్టు వెల్లడించారు. ఈ పథకానికి కేంద్ర గృహ నిర్మాణ పథకాన్ని అడాప్ట్ చేసుకుంటామని చెప్పారు.

పేదలకు అన్యాయం జరగొద్దనే ఉద్దేశంతో కేంద్రం ఎన్ని షరతులు పెట్టినా ఒప్పుకొంటున్నామని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం లోగోను పెట్టుకున్నా అభ్యంతరం లేదని చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయాలని, కేంద్రం ఎంత ఇచ్చినా తీసుకుంటామని, ఇవ్వకపోయినా ఇళ్ల నిర్మాణం ఆపబోమని స్పష్టంచేశారు.

గత ప్రభుత్వం తెలంగాణ ధనిక రాష్ట్రమని చెపుతూ.. కేంద్రాన్ని నిధులు అడగలేదని విమర్శించారు. ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. కేంద్రం నుంచి ఒక ఇంటికి పట్టణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేల వరకు ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను ఉచితంగా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. 

ఇంటి స్థలం లేని వారికి రెండోదశలో.. 

మొదటి దశలో సొంత స్థలం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తామని, రెండో దశలో ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వం 75 నుంచి 80 గజాల వరకు స్థలం కేటాయించి, ఇళ్లు నిర్మించి ఇస్తుందని మంత్రి తెలిపారు. మొదటి దశలో అవకాశం రానివారికి రెండో విడతలో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు.

ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 4 రాష్ట్రాల్లో వివరాలు సేకరించి ముందుకుపోతున్నామని, ఒక్కో మండలంలో కనీసం ఒకరు లేదా ఇద్దరు ఏఈలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టంచేశారు. 

సిబ్బంది కోసం ప్రస్తుతం పెద్దగా పనిలేని 16 శాఖలకు చెందిన వారిని ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలిపారు. గత ప్రభుత్వంలో పూర్తికాని ఇళ్లకు కూడా నిధులను విడుదల చేస్తామని వెల్లడించారు. ఎక్కడైనా ఇందిరమ్మ కాలనీలు కొత్తగా ఏర్పడితే కరెంట్, రోడ్లు, డ్రైనేజీలు ఇతర మౌలిక వసతులు ప్రభుత్వమే కల్పిస్తుందని చెప్పారు.

అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూం ఇండ్లను కూడా పూర్తి చేసిన అర్హులైన వారికి కేటాయిస్తామని స్పష్టంచేశారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 19.36 లక్షల ఇళ్లను నిర్మించినట్టు మంత్రి వివరించారు.

ఎస్సీ, ఎస్టీలకూ రూ.5 లక్షలే.. 

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు ఇవ్వాలని మ్యానిఫెస్టోలో పొందుపర్చిన అంశాన్ని మీడియా ప్రతినిధులు గుర్తుచేయగా.. ఇప్పుడు అలాంటి నిర్ణయమేది లేదని, అందరికి రూ.5 లక్షల వరకు ప్రభుత్వం సాయం చేస్తుందని పొంగులేటి స్పష్టంచేశారు.

ఇండ్ల నిర్మాణానికి సంబంధించి మెటీరియల్ ధరల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇసుకను ఉచితంగా అందించే ఆలోచన చేస్తున్నట్టు వివరించారు. ఇండ్ల నిర్మాణానికి అవసరమైతే బ్యాంకులు లేదా ఇతర సంస్థల నుంచి రుణాలు తీసుకుంటామన్నారు.