calender_icon.png 4 October, 2024 | 10:57 AM

సర్కార్ ధన దాహం తగ్గడం లేదు

04-10-2024 01:41:22 AM

బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ 

హైదరాబాద్, అక్టోబర్ 3(విజయక్రాంతి): రాష్ట్రంలో హైడ్రా చర్యలతో పేదల గుండెలు ఆగుతున్నా రేవంత్ సర్కార్‌కు మాత్రం ధనదాహం తగ్గడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించారు. గురువారం ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ సీఎం రేవంత్ అనేక కుటుంబాలను రోడ్డుకిడ్చి వారి కుటుంబాల్లో చిచ్చుపెడు తున్నాడన్నారు.

ఇండ్లు ఖాళీ చేస్తే డబుల్ బెడ్‌రూంతో పాటు రూ. 25 వేల పారితోషికమంటూ అధికారులు వెకిలి ఆఫర్లు ఇస్తున్నారని మండిపడ్డారు. లక్షలు వెచ్చించి కట్టుకున్న ఇండ్లకు రూ.25 వేలు ఎలా ఇస్తారని, ముఖ్యమంత్రి సోదరుడు, మంత్రుల ఇంటికి రూ.50 వేలు ఇస్తామని, వారిని డబుల్ ఇండ్లలోకి మారాలని సూచించారు.

ఇళ్లు కూలిపోతాయనే భయంతో ఒక బుచ్చ మ్మ, ఒక కూమారన్న చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. మరో చోట తన ఇల్లు కూలిపోతుందనే భయంతో కుటుంబ పెద్ద ప్రాణాలు తీసుకోగా తాజాగా అతని భార్య కూడా చనిపోయిందన్నారు. ఈ ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందన్నారు.

జర్నలిస్టు చిలుక ప్రవీణ్‌పై కాంగ్రెస్ గుండాలు విచక్షణ రహితంగా దాడి చేయడం బాధాకరమని కేటీఆర్ పేర్కొన్నారు. పాలకుల తప్పుడు విధానాలను ఎత్తిచూపితే దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రోజురోజుకు ప్రభుత్వ ఆదాయం పడిపోతుందని, పరిపాలనా వైఫల్యానికి ఇది నిదర్శమని కెటీఆర్ విమర్శించారు.  అనుభవ రాహిత్యంతోనే ఇలాంటి దుస్థుతి నెలకొందన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో లక్షన్నర కోట్లు ఖర్చు ఎందుకని నిలదీశారు.