బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్
హైదరాబాద్, అక్టోబర్ 20 (విజయక్రాంతి): గ్రూప్స్ అభ్యర్థులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాఠీలు ఝుళిపిస్తూ మొండిగా వ్యవహరిస్తుందని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి, టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి ఇద్దరూ కలిసి గ్రూప్ 1 అభ్యర్థులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
జీవో 29తో అభ్యర్థుల నోట్లో మట్టికొడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేసినా రేవంత్ రెడ్డి గ్రూప్ 1 అభ్యర్థులను ఎందుకు కలవరని నిలదీశారు. గ్రూప్ ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఎవరి కోసం హడావిడిగా పరీక్షలు పెడుతున్నారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేలోపు జీవోను రద్దు చేసి పరీక్షలు వాయిదా వేయాలని కోరా రు.
రెండు నెలలు ఆలస్యం అయితే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. మహేందర్ రెడ్డి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ర్టంలో తుగ్లక్ పాలన నడుస్తోందని, చీఫ్ సెక్రటరీ సీఎం అడుగుజాడల్లో నడుస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రూప్స్ అభ్యర్థులకు కేంద్రంగా తెలంగాణ భవన్ మారిందన్నారు.
ఇష్టం వచ్చినట్లు కేటీఆర్‌పై బండి సంజయ్ విమర్శలు చేశారని, బీఆర్‌ఎస్ నాయకులను కొట్టించానని బండి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనకు దమ్ముంటే సుప్రీం కోర్టులో సీనియర్ లాయర్లను పెట్టినిరుద్యోగుల తరపున వాదించాలని సూచించారు. ఇంకా బండి కార్పొరేటర్ మనస్తత్వాన్ని, రేవంత్ రెడ్డి జడ్పీటీసీ మనస్తత్వాన్నివీడటం లేదని ఎద్దేవా చేశారు.