వనపర్తి, ఆగస్టు 24 (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వం టెస్ట్ మిల్లింగ్ చేసి రైస్ మిల్లర్లను ఆదుకోవాలని రైస్ మిల్లర్ల అసోసియేషన్ సంఘం జిల్లా అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జగన్ డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో శనివారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. గడువు తీరకముందే ఆర్‌ఆర్ యాక్ట్ అమలు చేయడం సరైన విధానం కాదన్నారు. ఒక సందర్భంలో టెస్ట్ మిల్లింగ్ చేస్తే కేవలం 51 శాతం వచ్చిందని, అలాంటి సందర్భంలో 67 శాతం ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
జనుంపల్లి రైస్‌మిల్లు యజమాని ఆస్తుల జప్తు..
వనపర్తి, ఆగస్టు 24: వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు తహసీల్దార్ల బృందాలు రెవెన్యూ రికవరీయాక్ట్ కింద ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా ఐదు రైస్ మిల్లర్ల యజమానుల ఆస్తులను జప్తు చేశాయి. దీనిలో భాగంగా శనివారం పెబ్బేర్ మండలం జనుంపల్లిలోని శివసాయి ట్రేడర్స్ రైస్ మిల్లులో బృందం సోదాలు నిర్వహించాయి. దీంతో మిల్లు యజమాని వెంకట్రామిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటామని అధికారులను బెదిరించారు. దీంతో అధికారులు యజమానికి నచ్చజెప్పారు.
యజమాని రెండేళ్ల నుంచి రూ.3.57 కోట్లు ప్రభుత్వానికి బకాయి ఉండగా రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆయన ఇంట్లోని ఫ్రిడ్జ్, కూలర్లు, ఏసీ, ఫర్నీచర్‌ను సీజ్ చేసి కార్యాలయానికి తరలించారు. కొత్తకోట మండలంలోని వెంకటేశ్వర ట్రేడర్స్ యజమాని వెంకటరమణ ఆస్తులనూ బృందం జప్తు చేసింది. డిఫాల్టర్ మారడంతో బృందం ఈ యాక్ట్‌ను ప్రయోగించింది. ఒక కారు, ఎల్‌ఈడీ టీవీ, రిఫ్రిజిరేటర్ ఏసీ, ఇన్వర్టర్ బ్యాటరీస్ జప్తు చేసింది.